బెల్లంపల్లి: భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) సింగరేణి కోల్‌బెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ విడుదల చేసిన హెచ్చరికల లేఖపై పోలీసు యంత్రాంగం దర్యాప్తు చేపట్టింది. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, కొందరు కాంగ్రెస్ నాయకులు, భూకబ్జాదారులను లక్ష్యంగా చేసుకుని హెచ్చరించడంతో అన్ని కోణాల్లో విచారణ చేపట్టింది. లేఖపై అనుమానాలు వ్యక్తం చేస్తూ బెల్లంపల్లి పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు ఒకరు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. లేఖలోని నిజాలను నిగ్గు తేల్చే పనిలో నిమగ్నమయ్యారు. ఆ లేఖ ఏ ప్రాంతం నుంచి పంపించారు, ఏ పత్రికలో ముందుగా ప్రచురితమైంది, నిజమైనాదేనా..? మావోయిస్టుల పేరిట మరెవరైనా విడుదల చేశారా..? మాజీల ప్రమేయం ఏమైనా ఉందా, ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ శ్రేణులు ప్రభుత్వ భూములు కబ్జా చేసింది వాస్తవమేనా.. గంజాయి, రౌడీమూకలు రెచ్చిపోవడానికి కారకులెవరు అనే కోణాలు దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తులు, అనుమానితులను విచారణ చేస్తున్నారు. దర్యాప్తు తీరుపై రోజువారీగా ఉన్నతశ్రేణి పోలీసు యంత్రాంగం పర్యవేక్షిస్తోంది.
కమిషనరేట్ పరిధిలోనే హెచ్చరికలు
మరెక్కడా లేని విధంగా రామగుండం పోలీసు కమిషనరేట్ పరిధిలోనే మావోయిస్టుల హెచ్చరిక లేఖలు విడుదల అవుతుండడంతో పోలీసు వర్గాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. కొందరు ప్రజాప్రతినిధులు ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని, వీరంతా పద్ధతులు మార్చుకోవాలని హెచ్చరించడం, విలువైన ప్రభుత్వ, సింగరేణి భూముల కబ్జా, రౌడీల దౌర్జన్యాలు, భౌతికదాడులు, గంజాయి అక్రమ రవాణా తదితర అంశాలను మావోయిస్టులు లేఖలో ప్రస్తావించడం సంచలనమైంది. మావోయిస్టుల లేఖ పోలీసు ఉన్నతాధికారులకు మింగుడుపడని అంశంగా మారింది. ఈ ప్రాంతంలో మావోయిస్టులను సమూలంగా అణచివేసినా యథాతథంగా లేఖలు వస్తుండడం అధికా రులను అసహనానికి గురి చేస్తోంది. లేఖల పరంపరను తీవ్రంగా పరిగణిస్తున్న పోలీసు ఉన్నతాధికారులు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకునే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment