సాక్షి, హైదరాబాద్: జైలుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని.. నన్ను జైల్లో పెట్టి రేవంత్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతానంటే అందుకు రెడీ అంటూ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రెండు, మూడు నెలలు జైల్లో ఉంటే ఏమవుతుంది?. మంచిగా యోగా చేసుకుని బయటకు వస్తా. తర్వాత పాదయాత్రకు సిద్ధమవుతా’’ అంటూ వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్‌పై బీజేపీ, కాంగ్రెస్ కుట్రలు
‘‘టార్గెట్ కేటీఆర్‌పై కాదు.. ప్రజా సమస్యలపై పెట్టాలి. ఏసీబీ నుంచి నాకు ఎలాంటి నోటీసులు రాలేదు. నాకు న్యూస్ పేపర్ల నోటీసులే వస్తున్నాయి. రేవంత్ ఉడుత ఊపులకు భయపడేది లేదు. విచారణకు గవర్నర్ అనుమతినిస్తే.. ఆయన విచక్షణకు వదిలేస్తా. రాజ్ భవన్ వేదికగా బీజేపీ, కాంగ్రెస్ ములాఖత్ బయటపడింది. బీఆర్ఎస్‌ను ఖతం చేయాలని బీజేపీ, కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నాయి.’’ అని కేటీఆర్ ఆరోపించారు.
ఫార్ములా ఈ-రేస్‌పై స్పందిస్తూ..
ఫార్ములా ఈ రేస్‌ను త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. గ్రీన్ కో అనే కంపెనీ తప్పుకుంది. స్పాన్సర్‌ను పట్టుకుందామని మున్సిపల్ సెక్రటరీకి నేను చెప్పాను. 2024లో జరిగే ఫార్ములా ఈ రేస్‌కు హైదరాబాద్ పేరును చేర్చలేదు. హెచ్‌ఎండీఏ నుంచి నవంబర్ 14 2024న జీవో ఇచ్చాము. రాష్ట్ర ప్రభుత్వం నుండి 55 కోట్లు కట్టాము. కమిషనర్ అరవింద్ కుమార్ ఫైల్ పంపితే పురపాలక శాఖ మంత్రిగా నేను సంతకం పెట్టాను. ఒక డిపార్ట్‌మెంట్ నుంచి మరో శాఖకు నగదు బదిలీ జరుగుతుంది
హెచ్‌ఎండీఏకు స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది. హెచ్‌ఎండీఏకి కేబినెట్ అప్రూవల్ అవసరం లేదు. ఫార్ములా 4 రేస్ మేము నిర్వహించాము. రేవంత్ రెడ్డికి కూలగొట్టుడు తప్ప నిర్మాణం తెలియదు. నా పైన కోపంతో రేవంత్ రెడ్డి రాగానే ఫార్ములా ఈ-రేస్ రద్దు చేశారు. హైదరాబాద్‌లో ఈ ప్రీ రేస్ క్యాన్సిల్ అయితే అంతర్జాతీయ సంస్థలు విమర్శలు చేశాయి. నాపై కొన్ని మీడియా సంస్థలు అసత్య ప్రచారం చేస్తున్నాయి. రేస్ హైదరాబాద్ నగరంలో ఉండాలని రూ.55 కోట్లు పంపాము. అందులో నాకు ఏమైనా వచ్చాయా? నేను హెచ్‌ఎండీఏ వైఎస్ ఛైర్మన్‌గా నిర్ణయం తీసుకున్నా. 2036లో ఒలింపిక్స్ నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో పెడతామని అన్నారు.
ఒలింపిక్స్‌కు దాదాపు 3 లక్షల కోట్లు ఖర్చు అవుతాయి. రేవంత్ రెడ్డికి దమ్ముంటే మెగా కంపెనీపై ఏసీబీ కేసు పెట్టు. రేవంత్ రెడ్డి సంచులతో దొరికి 8 ఏళ్లు అయింది. మరి ఆ కేసు ఏమైందో?. ఫార్ములా ఈ రేస్ క్యాన్సిల్ చేసినందుకు రేవంత్ రెడ్డిపై కేసు పెట్టాలి. విశ్వ నగరం బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తున్నది రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ఇమేజ్‌ను పెంచినందుకు కేసు పెడతావా రేవంత్ రెడ్డి. డైవర్షన్ పాలిటిక్స్‌తో రేవంత్ రెడ్డి తప్పించుకోలేరు. నీ ఇష్టం వచ్చిన కేసు పెట్టుకో.. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చే వరకు వదిలిపెట్టం’’ అంటూ కేటీఆర్ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment