‘డిస్ట్రిబ్యూషన్’ తరలింపు!
● మంచిర్యాల నుంచి కాజీపేటకు.. ● షిఫ్ట్ చేసేలా తపాలాశాఖ యోచన ● సత్వర సేవలకు అంతరాయం ● ఇక్కడే కొనసాగించాలని ప్రజల అభ్యర్థన
పాతమంచిర్యాల: జిల్లాకేంద్రంలోని రైల్వేమెయిల్ సర్వీస్, సార్టింగ్ (డిస్ట్రిబ్యూషన్) కార్యాలయాన్ని కాజీపేటకు తరలించేందుకు తపాలాశాఖ యోచిస్తోంది. అక్కడి స్పీడ్‌పోస్టు కార్యాలయంలో విలీనానికి కసరత్తు చేస్తోంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏకై క సార్టింగ్ కార్యాలయం మంచిర్యాలలో ఉంది. జిల్లాలకు చెందిన పార్సిళ్లు, ఉత్తరాలను ఇతర ప్రాంతాలకు చేరవేయడానికి రైలుమార్గం ఉన్న మంచిర్యాలలో 1986లో దీన్ని ఏర్పాటు చేశారు. 2016 వరకు సేవలు సజావుగా కొనసాగాయి. ఇక్కడ ఉన్న స్పీడ్‌పోస్టు కార్యాలయాన్ని 2016లో వరంగల్‌కు తరలించారు. దీంతో స్పీడ్‌పోస్టు ఉత్తరాల బట్వాడా వరంగల్ నంచి కొనసాగుతోంది. దీంతో ఒక్కరోజు అందే ఉత్తరం మూడురోజులు ఆలస్యంగా అందుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్లు సైతం ఆలస్యంగా అందిన ఘటనలున్నాయి.
విలీనానికి మొగ్గు..
ఉద్యోగులను కుదించాలని, ఖర్చులు తక్కువ చేసుకోవాలనే ఉద్దేశంతో తపాలాశాఖ ఈ విలీనానికి మొగ్గుచూపుతోంది. దీంతో సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. విలీన ప్రక్రియ వద్దని హైదరాబాద్‌లోని చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ కార్యాలయ సూపరిండెంటెండ్‌కు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్ సంఘం నాయకులు వినతిపత్రాలు అందజేశారు. జిల్లాల్లో ఇప్పటివరకు ఉత్తరాలు, పార్శిళ్ల కొరియర్ సేవలను తపాలా ద్వారా పంపిస్తున్నారు. ఈ తరహా సేవలు లేకపోతే ప్రజలు ప్రైవేట్ కొరియర్ సర్వీస్‌ల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆర్‌ఎంఎస్, సార్టింగ్ కార్యాలయాన్ని ఇక్కడే కొనసాగేలా ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని పలువురు కోరుతున్నారు.
చర్యలు తీసుకుంటాం
మంచిర్యాల నుంచి రైల్వేమెయిల్ సర్వీస్, సార్టింగ్ కార్యాలయం తరలిపోకుండా తపాలా శాఖ అధికారులతో మాట్లాడతాను. ప్రజలకు సేవలందించే కార్యాలయాలు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లకుండా చర్యలు తీసుకుంటాం.
– గడ్డం వంశీకృష్ణ, పెద్దపల్లి ఎంపీ
Comments
Please login to add a commentAdd a comment