తుదిదశకు ఉద్యోగ ప్రక్రియ
● 2008 డీఎస్సీ అభ్యర్థులకు తాత్కాలిక పద్ధతిన కొలువు ● మరోసారి వివరాలు పరిశీలించిన ఉన్నతాధికారులు
ఆదిలాబాద్‌టౌన్: 2008 డీఎస్సీ అన్ సక్సెస్‌ఫుల్ అభ్యర్థుల తాత్కాలిక ఉద్యోగ ప్రక్రియ తుదిదశకు వచ్చింది. ఇప్పటికే అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించిన విద్యాశాఖాధికారులు మరోసారి పరిశీలన చేపట్టారు. గురువారం వరంగల్ ఆర్జేడీ, అబ్జర్వర్ సత్యనారాయణరెడ్డి డీఈవో కార్యాలయంలో అభ్యర్థుల వివరాలను పరిశీలించారు. 2008 డీఎస్సీలో 70:30 లిస్టులో పేర్లు ఉండి ఉద్యోగం పొందని బీఎడ్ అభ్యర్థులకు ఇటీవల ప్రభుత్వం తాత్కాలిక పద్ధతిన ఉద్యోగం కల్పించేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో 135 మంది అభ్యర్థులు ఉన్నట్లు విద్యా శాఖాధికారులు గుర్తించారు. ఇటీవల సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టగా ఆదిలాబాద్ నుంచి 13 మంది, కుమురం భీం ఆసిఫాబాద్ నుంచి 10, మంచిర్యాల నుంచి 26, నిర్మల్ నుంచి 15 మంది అభ్యర్థులు హాజరయ్యారని, ఇందులో మంచిర్యాల జిల్లాకు చెందిన ఇద్దరు డీఎడ్ అభ్యర్థులు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే డీఎస్సీ 2008 లిస్టులో 30 శాతం తొలగించబడిన బీఎడ్ అభ్యర్థులకు న్యాయం చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు వారికి ప్రభుత్వం తాత్కాలిక పద్ధతిన ఉద్యోగం కల్పించనుంది. 16 సంవత్సరాల తర్వాత బీఎడ్ అభ్యర్థులకు కొలువులు దక్కనున్నాయి. పరిశీలన కార్యక్రమంలో డీఈవో ప్రణీత, సూపరింటెండెంట్లు భోజన్న, మమత, విద్యాశాఖ ఉద్యోగులు, సిబ్బంది శ్రీహరిబాబు, తుషార్, సుకుమార్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment