ఆసిఫాబాద్: గంజాయి సాగు చేస్తున్న కేసులో ఒకరికి పదేళ్ల జైలుశిక్షతోపాటు రూ.లక్ష జరిమానా విధిస్తూ జిల్లా సెషన్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేశ్ గురువారం తీర్పుచెప్పారు. జైనూర్ సీఐ రమేశ్ కథనం ప్రకారం..సిర్పూర్(యు) మండలం పగిడి గ్రామానికి చెందిన ఆత్రం అమృతరావు తన వ్యవసాయ క్షేత్రంలో గంజాయి సాగు చేస్తున్నట్లు సమాచారంతో 2021 అక్టోబర్ 12న అప్పటి ఎస్సై విష్ణువర్ధన్ తనిఖీ చేయగా గంజాయి మొక్కలు లభ్యమయ్యాయి. సీఐ హనూక్ కేసు దర్యాప్తు చేపట్టి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. పీపీ జగన్మోహనరావు సాక్షులను విచారించి నేరం రుజువు చేయడంతో ఈ మేరకు న్యాయమూర్తి తీర్పునిచ్చారు. నిందితుడికి శిక్షపడేలా కృషి చేసిన డీఎస్పీ కరుణాకర్, సీఐ రమేశ్, ఎస్సై రామకృష్ణ, కోర్టు లైజనింగ్ అధికారి రామ్‌సింగ్, కోర్టు సిబ్బందిని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అభినందించారు.
ఒకరిని గాయపర్చిన కేసులో ఐదుగురికి జైలు
ఆదిలాబాద్‌టౌన్: పాతకక్షలు మనసులో పెట్టుకుని ఒకరిని గాయపర్చిన కేసులో ఐదుగురికి మూడు నెలల జైలుశిక్షతోపాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ పీసీఆర్ కోర్టు జడ్జి దుర్గారాణి తీర్పునిచ్చినట్లు లైజన్ అధికారి గంగాసింగ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం..పట్టణంలోని కేఆర్‌కే కాలనీకి చెందిన పవార్ కనకయ్య కళ్లలో కారంపొడి చల్లి 2019 ఏప్రిల్ 17న ఆయన బంధువులు ఒర్సు సురేశ్, పీరాజీ, గంగయ్య, సాయి, ఒల్లెపు సత్తయ్యలు దాడికి పాల్పడ్డారు. బాధితుడు మావల పోలీసులకు ఫిర్యాదు చేయగా, అప్పటి ఎస్సై ముజాహిద్ కేసు దర్యాప్తు చేశారు. పీపీ నవీన్‌కుమార్ 8 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా నేరం రుజువు చేశారు. ఈ మేరకు జడ్జి తీర్పు వెలువరించారు.
Comments
Please login to add a commentAdd a comment