అసలే చలి.. ఆపై చన్నీళ్లు!
● పనిచేయని సోలార్ హీటర్లు
● తీవ్రమైన చలితో అనారోగ్యం
● పట్టించుకోని అధికారులు
మెదక్‌జోన్: కస్తూర్బా విద్యార్థినులకు చన్నీటి స్నానాలు తప్పడం లేదు. ఆయా చోట్ల సోలార్ హీటర్లు ఏర్పాటు చేసినా.. అవి పనిచేయకపోవడంతో అష్టకష్టాలు పడుతున్నారు. సకాలంలో తరగతులకు హాజరుకావాలనే ఉద్దేశంతో తప్పనిసరి పరిస్థితుల్లో తీవ్రమైన చలిలో స్నానాలు చేస్తూ అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తమ సమస్యకు పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు.
జిల్లాలో 19 కేజీబీవీలు..
జిల్లావ్యాప్తంగా 19 కేజీబీవీలను ఏర్పాటు చేయగా 3,832 విద్యార్థినులు చదువుకుంటున్నారు. 15 విద్యాలయాలను 2007లో ఏర్పాటు చేయగా, వాటికి సొంత భవనాలను నిర్మించారు. మరో నాలుగింటిని నాలుగేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. వాటికి సొంత భవనాలు లేకపోవడంతో ఇతర మండలాల్లోని కేజీబీవీల్లో కొనసాగిస్తున్నారు. వాటిలో హవేళీఘణాపూర్ మండలంలో ఏర్పాటు చేసిన పాఠశాలను చిన్నశంకరంపేట, మాసాయిపేట పాఠశాలను వెల్దుర్తిలో, నిజాంపేట పాఠశాలను రామాయంపేట, నార్సింగికి మంజూరైన పాఠశాలను చేగుంటలోని కేజీబీవీలో కొనసాగిస్తున్నారు. వీటిలో చలికాలంలో విద్యార్థినులు స్నానం చేసేందుకు వేడి నీటి కోసం 2017లో ఓ కాంట్రాక్టర్ ముందుకు వచ్చి సోలార్ హీటర్లను ఏర్పాటు చేశారు. వాటిలో కొల్చారం, రామాయంపేట, రేగోడ్, వెల్దుర్తి కేజీబీవీలకు మాత్రమే కనెక్షన్ ఇచ్చిన సదరు కాంట్రాక్టర్ మిగితా వాటికి కనెక్షన్ ఇవ్వలేదు. దీంతో లక్షలాది రూపాయలు వెచ్చించి ఏర్పాటుచేసిన సోలార్ పరికరాలు నిరుపయోగంగా మారాయి. అయినా సదరు కాంట్రాక్టర్‌పై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఫలితంగా విద్యార్థినులకు చన్నీటి స్నానాలు తప్పడం లేదు.
కనీస వసతులు కరువు
జిల్లాలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. రాష్ట్రంలోనే ఆదిలాబాద్ తర్వాత అధికంగా మెతుకు సీమలోనే చలి ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. అయినా అధికారులు పట్టించుకున్న పాపానపోవడం లేదు. ఇంతటి చలిలో విద్యార్థినులు చన్నీటి స్నానం చేస్తూ తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారు. గత నెల మెదక్ పట్టణంలోని కేజీబీవీలో చదువుతున్న ఓ విద్యార్థిని అనారోగ్యానికి గురై పరిస్థితి విషమించగా కలెక్టర్ ఆదేశానుసారం ఆ విద్యార్థినిని హైదరాబాద్‌కు తరలించి చికిత్స చేయించారు. అలాగే విద్యార్థినులకు ప్రతి సంవత్సరం స్వెట్టర్లు, రగ్గులు, బెడ్‌షీట్స్, ప్లేట్లు, స్పోర్ట్స్ డ్రెస్, షూస్ ఇచ్చేవారు. గత నాలుగేళ్లుగా వాటిని సైతం ఇవ్వడం లేదు. అంతేకాకుండా ప్రతి నెల శానిటరీ హెల్త్ అండ్ హైజెనిక్ కిట్లు ఇచ్చేవారు. ప్రస్తుతం వాటిని కూడా ఇవ్వడం లేదని పలువురు విద్యార్థినులు వాపోయారు. ఇప్పటికై నా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి విద్యార్థినులకు సరైన సౌకర్యాలు కల్పించి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నిరుపయోగంగా సోలార్ హీటర్
Comments
Please login to add a commentAdd a comment