కొరవడిన చెత్తశుద్ధి
రామాయంపేట(మెదక్): రామాయంపేట ము న్సిపాలిటీ పరిధిలో తడి, పొడి చెత్త సేకరణ అస్తవ్యస్తంగా మారింది. ప్రజలకు అవగాహన కల్పించి అధికారులు చెత్త డబ్బాలు పంపిణీ చేసినా ఫలితం లేకుండా పోతుంది. మున్సిపాలిటీ పరిధిలో ప్రతిరోజూ కనీసం ఎనిమిది టన్నుల చెత్తను సిబ్బంది సేకరిస్తున్నారు. చెత్తను ట్రాక్టర్లు, ట్రాలీ ఆటోల్లో డంప్‌యార్డుకు తరలిస్తున్నారు. పట్ణణంలోని అన్ని గృహాలకు తడి, పొడి చెత్త వేర్వేరుగా వేయడానికి వీలుగా డబ్బాలు పంపిణీ చేశారు. మొదట్లో కొన్ని రోజులు వేర్వేరుగా వేసినా.. ఆ తర్వాత ఒకే చో ట కలిపి ఇస్తున్నారు. పట్టణ శివారులోని ఎక్కలదేవుని బండ పైభాగంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన డంప్‌యార్డు వద్ద ఆరు బయట చెత్తను వేస్తుండడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారి దుర్వాసన వెదజల్లుతోంది. నాలుగేళ్లుగా ఒకే చోట చెత్తను వేస్తుండడంతో టన్నుల కొద్ది పేరుకుపోయింది. దీంతో ఆప్రాంతంలో వ్యవసాయం చేసుకుంటున్న రైతులు దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారు. డంప్‌యార్డు వద్ద తడి, పొడి చెత్తను వేరు చేయడానికి వీలుగా డీఆర్ సెంటర్ ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈవిషయమై మున్సిపల్ సిబ్బందితో పాటు పట్టణవాసులకు పలుమార్లు అవగాహన కల్పించారు. డంప్‌యార్డు ఆవరణలోని చెత్తను గుర్తుతెలియని వ్యక్తులు తరచూ దహనం చేస్తుండడంతో వాతావరణ కాలుష్యం నెలకొంటుంది. ఇక్కడి నుంచి డంప్‌యార్డును వేరే చోటుకు తరలించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
అస్తవ్యస్తంగా తడి, పొడి చెత్త సేకరణ
అవగాహన కల్పించిన ఆచరణలో విఫలం
నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం
మరింత అవగాహన కల్పిస్తాం
పట్టణంలో తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేయడానికి వీలుగా అన్ని గృహాలకు చెత్త డబ్బాలు పంపిణీ చేశాం. పట్టణవాసులు మొదట్లో వేర్వేరుగా ఇచ్చినా.. ప్రస్తుతం ఒకే చోట ఇస్తున్నారు. ఈవిషయమై ఇటీవలే ఉన్నతాధికారుల ఆదేశాలు జారీ చేశారు. ఇకనుంచి ఖచ్చితంగా తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నాం.
– దేవేందర్, మున్సిపల్ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment