క్రీడలతో మానసికోల్లాసం
వెల్దుర్తి(తూప్రాన్): క్రీడలు మానసికోల్లాసానికి, శారీరక దారుఢ్యానికి దోహదపడతాయని డీఈఓ రాధాకిషన్ అన్నారు. మండల కేంద్రం మాసాయిపేటలో నిర్వహించిన 9వ రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలోని 20 జిల్లాల నుంచి 20 జట్లు పాల్గొన్న ఈ పోటీల్లో నిజామాబాద్ జిల్లా జట్టు ప్రథమ, మెదక్ జట్టు ద్వితీయ, మంచిర్యాల జట్టు తృతీయ స్థానంలో నిలిచాయి. ఈసందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో సైతం రాణించి రాష్ట్రానికి మంచిపేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఓడిన వారు నిరుత్సాహ పడకుండా గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని సూచించారు. అనంతరం టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలు మాసాయిపేటలో నిర్వహించడం అభినందనీయమన్నారు. మున్ముందు ఇలాంటి క్రీడలు నిర్వహించాలని, కావాల్సిన సౌకర్యాలను కల్పించడానికి తనవంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త కార్యదర్శి శోభన్‌బాబు, తెలంగాణ సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అభిషేక్‌గౌడ్, జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి రమేష్, హెచ్‌ఎం ధర్మపురి, ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షుడు రంగారెడ్డి, కార్యదర్శి హరిరంజన్ శర్మ, జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్యాంసుందర్‌శర్మ, వివిధ జిల్లాల క్రీడాకారులు, కోచ్‌లు పాల్గొన్నారు.
డీఈఓ రాధాకిషన్
Comments
Please login to add a commentAdd a comment