ఇచ్చిన మాట నిలబెట్టుకోండి
అన్నివర్గాలకు సంక్షేమ ఫలాలు
లింగ వివక్ష లేని సమాజమే లక్ష్యం
మెదక్ కలెక్టరేట్: ఇచ్చిన మాట ప్రకారం ప్రభు త్వం పింఛన్లు పెంచాలని దివ్యాంగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్ నగేష్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పింఛన్లు రూ. 6 వేలకు పెంచుతామని హామీ ఇచ్చిందన్నారు. ప్రభుత్వం వచ్చి ఏడాది దగ్గర పడుతున్నా హామీని అమలు చేయడం లేదని వాపోయారు. అలాగే అర్హులైన దివ్యాంగులకు స్వయం ఉపాధి కోసం బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించాలన్నారు. అవసరమైన వారికి వీల్‌చైర్లు, స్కూటీలు, ట్రై సైకిళ్లు అందజేయాలని కోరారు. రిజర్వేషన్ ప్రకారం అర్హులైన దివ్యాంగులకు ఉద్యోగాలు ఇవ్వాలని, ఉపాధి హామీలో అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మల్లేశం, దివ్యాంగులు పాల్గొన్నారు.
తూప్రాన్: అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ ఫలా లు అందించమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నారు. సోమవారం డివిజన్ కేంద్రంలోని పెద్ద చెరువులో మున్సిపల్ చైర్‌పర్సన్ మామిళ్ల జ్యోతి, మత్స్యశాఖ జిల్లా డైరెక్టర్ దేవేందర్‌తో కలిసి చేప పిల్లలను వదిలారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేప పిల్లలను పంపిణీ చేయడంతో మత్స్యకారులకు ఉపాధి లభిస్తుందన్నారు. వారు ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశాలు ఉన్నాయని వివరించారు. కార్యక్రమంలో మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి, మాజీ హౌసింగ్ బోర్డు చైర్మన్ భూంరెడ్డి, జిల్లా మత్స్యశాఖ చైర్మన్ రామకృష్ణయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు భాస్కర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు, గంగపుత్ర సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మెదక్ కలెక్టరేట్: లింగ వివక్ష లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మెదక్ సఖీ కేంద్రం నిర్వాహకురాలు రేణుక పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ గిరిజన మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా హింస నిర్మూలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డిసెంబర్ 10వ తేదీ మానవ హక్కుల దినోత్సవం వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మహిళలు ఎదుర్కొంటున్న హింసకు సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించారు. లింగవివక్ష లేని సమాజం కోసం తల్లిదండ్రులు తప్పనిసరిగా కృషి చేయాలన్నారు. మహిళా హక్కులు, బాలిక విద్య, సఖి అందించే ఐదురకాల సమీకృత సేవలను వివరించారు. బాల్య వివాహాల వల్ల కలిగే వ్యతిరేక పరి ణామాలు, మహిళల అక్రమ రవాణా, అత్యవసర హెల్ప్‌లైన్ 181, 1098, 100, 112 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఉమాదేవి, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.
28న బహిరంగ వేలం
తూప్రాన్: తూప్రాన్ మున్సిపాలిటీలోని దుకాణ సముదాయాలకు ఈనెల 28వ తేదీన బహిరంగ వేలం పాట నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ పాతూరి గణేష్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్టణంలోని పాత పురపాలక కార్యాలయం పక్కన ఉన్న ఐదు దుకాణాలతో పాటు మోర్ సూపర్ మార్కెట్ ఎదురుగా ఉన్న 400 గజాల ఖాళీ స్థలానికి వేలం పాట నిర్వహిస్తామన్నారు. ఈనెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ఆసక్తి ఉన్న వారు ముందుగా పాత పురపాలక కార్యాలయం పక్కన ఉన్న దుకాణాలకు రూ. లక్ష డీడీని కమిషనర్ పేరుతో తీయాలన్నారు. మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తుతో పాటు డీడీని జత చేసి ఇవ్వాలన్నారు. అలాగే మోర్ సూపర్ మార్కెట్ ఎదురుగా వున్న 400 గజాల ఖాళీ స్థలానికి రూ. 2 లక్షల డీడీతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment