నేరుగా ఫిర్యాదు అందించాలి
మెదక్ మున్సిపాలిటీ: ప్రజలు మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నేరుగా వచ్చి సమస్యలు పరిష్కరించుకోవాలని అదనపు ఎస్పీ అడ్మిన్ మహేందర్ సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లాస్థాయి ప్రజావాణి నిర్వహించారు. ఈసందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఎలాంటి భయం లేకుండా నేరుగా వచ్చి సంప్రదించాలన్నారు. ఫిర్యాదుదారులకు చట్టప్రకారం న్యా యం జరిగేలా చూడాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు.
త్వరలోనే డేటా ఎంట్రీ పూర్తి
చిలప్‌చెడ్(నర్సాపూర్): జిల్లావ్యాప్తంగా 370 మంది ఆపరేటర్లు సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ చేస్తున్నారని, త్వరలోనే ప్రక్రియ పూర్తవుతుందని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య అన్నారు. సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో కొనసాగుతున్న డేటా ఎంట్రీ ప్రక్రియను పరిశీలించి మాట్లాడారు. ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా పక్కాగా నిర్వహించాలని ఆపరేటర్లను ఆదేశించారు. అనుమానాలు ఉంటే సూపర్‌వైజర్లు, ఎన్యుమరేటర్లను అడిగి తెలుసుకోవాలన్నారు. సర్వే వివరాలను గోప్యంగా ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఆనంద్ సిబ్బంది పాల్గొన్నారు.
మొక్కలను సంరక్షించాలి
రామాయంపేట(మెదక్): నర్సరీలోని మొక్కలను సంరక్షించాలని డీఎఫ్‌ఓ జోజి సిబ్బందికి సూచించారు. సోమవారం కోమటిపల్లి బీట్ లోని వన నర్సరీని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. నర్సరీలోకి పశువులు రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట రేంజ్ అధికారి విద్యాసాగర్, ఇతర అధికారులు, సిబ్బంది ఉన్నారు.
ఎరువులు, విత్తనాలు సిద్ధం
రామాయంపేట(మెదక్): రామాయంపేట మండలంలో 14,600 ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యే అవకాశం ఉందని, ఈ మేరకు ఎరువులు, విత్తనాలు సిద్ధంగా ఉంచడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఏడీఏ రాజ్‌నారాయణ తెలిపారు. సోమవారం వ్యవసాయ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈసారి 13,600 ఎకరాల్లో వరి, ఎనిమిది వందల ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగయ్యే అవకాశం ఉందన్నారు. ఇందుకు సంబంధించి 1,460 మెట్రిక్ టన్నుల యూరియా, కాంప్లెక్స్ ఎరువు లు, 730 మెట్రిక్ టన్నుల పొటాష్ అవసరమవుతుందని అంచనా వేసినట్లు వివరించారు.
రోగులకు మందులు
అందుబాటులో ఉంచాలి
కొల్చారం(నర్సాపూర్): రోగులకు అవసరమైన అన్ని మందులు అందుబాటులో ఉంచాలని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సృజన సిబ్బందిని ఆదేశించారు. సోమవారం కొల్చారం పీహెచ్‌సీ ని తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ప్రజారోగ్యానికి సంబంధించిన కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. గర్భిణులకు నిర్వహిస్తున్న పరీక్షలను పరిశీలించారు. అనంతరం అక్కడి సిబ్బందితో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో ఆస్పత్రి వైద్యాధికారి రమేష్, ఆయుష్ వైద్యాధికారి హర్ష, ఫార్మసిస్ట్ సరిత, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment