కోలీవుడ్‌లో జివి ప్రకాష్ కుమార్ తమిళ చిత్రసీమలో మల్టీటాలెంటెడ్‌గా గుర్తింపు పొందాడు. ఎ.ఆర్.రహమాన్ మేనళ్లుడిగా ఆయన ఎంట్రీ ఇచ్చినా.. తర్వాత చిత్రసీమలో తనదైన ముద్ర వేశాడు. చిన్న వయస్సులోనే సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి, తన 25 ఏళ్లకే 25 చిత్రాలకు మ్యూజిక్ అందించి రికార్డు సాధించాడు. ఆ తర్వాత 'డార్లింగ్' మూవీతో హీరోగా సత్తా చాటి సింగర్, యాక్టర్,నిర్మాతగా కోలీవుడ్‌లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ధనుష్ 'కెప్టెన్ మిల్లర్', విక్రమ్ 'తంగళన్' సహా పలు చిత్రాలకు మ్యూజిక్ అందించాడు.
సినిమాలతో పాటు ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను జివి ప్రకాష్ కుమార్ షేర్ చేస్తాడు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై గొంతు విప్పి, సహాయం కోరిన వారికి చేతనైనంత సాయం చేస్తుంటాడు. ఈ పరిస్థితిలో ఒక వ్యక్తి తన సోదరి బిడ్డను ఎవరైనా కాపాడాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. బ్రెయిన్ ట్యూమర్ కారణంగా ఏడాది బిడ్డ ఇబ్బంది పడుతుందని తక్షణమే శస్త్రచికిత్స అవసరమని వైద్యులు చెప్పడంతో సహాయం కోరుతూ.. ఇలా పోస్ట్ చేశాడు.
'ఆన్‌లైన్‌లో ఇలా ఆర్థిక సహాయం అడగడానికి ఇబ్బందిగా ఉందని అయినా ఆ బిడ్డ ప్రాణాల కోసం ఎలాగైనా అడుగుతాను. నా సోదరి అబ్బాయి (1 సంవత్సరం) మెదడు వైపు కణితి ఉందని వైద్యులు చెప్పారు. ఇది కొంచెం భయంగా ఉంది. మధురై అపోలో ఆసుపత్రికి బాబును తీసుకెళ్తే అక్కడ వెంటనే ఆపరేషన్ అవసరం అన్నారు. రూ. 3.5 లక్షల నుంచి 4 లక్షలు ఖర్చవుతుందని చెబుతున్నారు. మా కుటుంబం నుంచి 2 లక్షల వరకు సిద్ధం చేశాను. మీరు నాకు కొంత సాయం చేసినా.. నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. మీకు తోచినంత చేయండి మిత్రులారా.' అని ఆ యువకుడు తెలిపాడు.
సినీనటుడు జివి ప్రకాష్ కుమార్ ఆ పోస్ట్‌కు రియాక్ట్ అయ్యాడు. ఆ చిన్నారి ఆపరేషన్ కోసం తన వంతుగా రూ.75 వేలు పంపారు. దీన్ని తన ఎక్స్ సైట్‌లో పోస్ట్ చేసి ' నా నుంచి ఇది చిరు సాయం' అని పోస్ట్ చేశాడు. దీంతో సోషల్ మీడియాలో జివి ప్రకాష్ చర్యను పలువురు అభినందిస్తున్నారు. దీంతో ఆ చిన్నారి ఆపరేషన్‌కు మరికొందరు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment