ఆదిపురుష్ విషయంలో అనుకున్నది ఒక్కటి.. అయినది ఒక్కటి అనేలా ఉంది పరిస్థితి! ప్రభాస్ ఫ్యాన్స్, రామ భక్తులంతా సినిమా చూసి పండగ చేసుకుంటారనుకుంటే చాలామంది మెచ్చుకోలేక, నొచ్చుకోలేక సైలెంట్ అయిపోతున్నారు. అయితే కొందరు మాత్రం ఆదిపురుష్‌లో అక్కడక్కడా వచ్చే కొన్ని సన్నివేశాలను, డైలాగులను అస్సలు సహించలేకపోతున్నారు. మరీ ముఖ్యంగా హనుమంతుడు చెప్పే సంభాషణలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
సీతాదేవిని వెతికేందుకు వెళ్లిన హనుమంతుడి తోకకు లంకలో మంట పెడతారు. ఆ సమయంలో హనుమాన్ ఇంద్రజిత్తుతో.. నా తోకకు కట్టిన గుడ్డ నీ బాబుది... దానికి రాసిన చమురు నీ బాబుది... నిప్పు కూడా నీ బాబుకే.. అన్నట్లుగా ఓ డైలాగ్ చెబుతాడు. హనుమాన్‌కు మరీ ఇంత మాస్ డైలాగ్‌లు అవసరమా? అని నెట్టింట చర్చ జరుగుతోంది.
తాజాగా ఈ వివాదంపై ఆదిపురుష్ డైలాగ్ రచయిత మనోజ్ ముంతషీర్ స్పందించాడు. 'నావైపు నుంచి ఎటువంటి తప్పు లేదు. ఎంతో నిశితంగా ఆలోచించాకే హనుమంతుడి సంభాషణలు రాశాను. సినిమాలో చాలా పాత్రలున్నాయి. అందరూ ఒకేలా మాట్లాడరు కదా.. పాత్రల మధ్య వైవిధ్యం చూపించాలనే హనుమంతుడి భాషను సింపుల్‌గా ఉండేలా జాగ్రత్తపడ్డాను. లంకా దహనం సమయంలో హనుమంతుడి చెప్పే డైలాగ్ గురించి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
కానీ మనందరికీ రామాయణం ఎలా తెలుసు? చిన్నప్పటి నుంచి కథలు కథలుగా చెప్తేనే కదా మనం తెలుసుకున్నాం. రామాయణంపై ఎన్నో గ్రంథాలు కూడా ఉన్నాయి. నేను పల్లెటూరి నుంచి వచ్చినవాడిని. నాకు మా నానమ్మ, అమ్మమ్మలు రామాయణ కథలను చాలా సింపుల్‌గా చెప్పేవారు. జానపద కళాకారులు కూడా హనుమంతుడి సంభాషణలను ఇలాగే చెప్పేవారు. దాన్నే నేను ఆదిపురుష్‌లో వాడాను. అంతే తప్ప, నేనేమీ కొత్తగా డైలాగ్ సృష్టించలేదు' అని వివరణ ఇచ్చాడు.
చదవండి: ఆదిపురుష్ రిజల్ట్.. ఇలా జరిగిందేంటబ్బా. . ఈ తప్పుల వల్లే!
Comments
Please login to add a commentAdd a comment