తమిళంలో బాయ్స్, కాదల్ చిత్రాలతో కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు భరత్. ఆ తర్వాత పలు భాషల్లో అనేక చిత్రాల్లో నటించి ఇప్పుడు అర్ధ సెంచరీ మైలురాయికి చేరుకున్నారు. ఈయన కథానాయకుడిగా నటించిన 50వ చిత్రం లవ్. మలయాళంలో మంచి విజయాన్ని సాధించిన లవ్ చిత్రానికి ఇది తమిళ రీమేక్. వాణిభోజన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని ఆర్పీ బాల స్వీయ దర్శకత్వంలో నిర్మించారు.
నటుడు వివేక్ ప్రసన్న రాధారవి జూనియర్ ముఖ్యపాత్ర పోషించిన ఈ చిత్రానికి పీజీ ముత్తయ్య ఛాయాగ్రహణం, లోని రప్పీల్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం ఈనెల 28న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. ఇది ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక జంట నేపథ్యంలో సాగే విభిన్న ప్రేమ కథా చిత్రం అని దర్శకుడు తెలిపారు.
పెళ్లయిన జంట మధ్య ప్రేమ, సంతోషం, కోపం, చిన్నచిన్న గొడవలు చివరికి ఎలాంటి పరిణామాలకు దారి తీశాయన్నదే ఈ చిత్ర కథ అని తెలిపారు. ఒక సంఘటనలో పొరపాటున భరత్ కారణంగా అతని భార్య హత్యకు గురవుతుందన్నారు. దానిని మార్చడానికి భరత్ తన స్నేహితులతో కలిసి ఏం చేశాడు? అన్న పలు ఆసక్తికరమైన అంశాలతో చిత్రం సాగుతుందని చెప్పారు. ఈ చిత్రం తనుకు చాలా ముఖ్యమైనదని నటుడు భరత్ పేర్కొన్నారు. కాగా మిరల్ చిత్రం తర్వాత భరత్‌తో కలిసి లవ్ చిత్రంలో నటించడం సంతోషంగా ఉందని వాణిభోజన్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment