
Bigg Boss Fame Ali Reza About Anchor Ravi: టెలివిజన్ చరిత్రలోనే అతిపెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్ చాలామందికి ఫేమ్ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అప్పటివరకు గుర్తింపు కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా బిగ్‌బాస్ షోతో ఓవర్ నైట్ స్టార్‌డం వస్తుంది. అదే స్థాయిలో కొందరి పాపులారిటీ అమాంతం తగ్గిపోతుంది. షోలో చేసే చిన్న చిన్న తప్పుల వల్ల కొందరు డీఫేమ్‌తో బయటకు రావడం చూస్తుంటాం. ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు సీజన్-5లో అందరి కన్నా ఎక్కువ పాపులారిటీ ఉన్న కంటెస్టెంట్లలో యాంకర్ రవి ఒకరు.
అయితే ప్రియ-లహరి ఎపిసోడ్ తర్వాత రవిపై నెగిటివిటి సైతం పెరిగిపోయింది. మొన్నటికి మొన్న శ్వేత సైతం రవికి దూరంగా ఉండాలంటూ హౌస్ మేట్స్‌ను హెచ్చరించిన సంగతి తెలిసిందే. చేసిన తప్పులు ఒప్పుకోకపోవడం సహా ఇతరులపై నిందలు వేస్తాడంటూ రవిని సోషల్ మీడియాలోనూ నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. దీనిపై బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్, రవి స్నేహితుడు అలీ రెజా స్పందించాడు. షోకు వెళ్లేముందే ఈ విషయాల గురించి మాట్లాడుకున్నామని, ఇలా అవుతుందని తనకు ముందే తెలుసని అలీ పేర్కొన్నాడు.
ఎవరితోనైనా గొడవలు వస్తే అది పరిష్కరించుకోవాలని రవి భావిస్తాడని, అయితే కొందరు అపార్థం చేసుకుంటున్నారన్నాడు. రవి తనకు వ్యక్తిగతంలో తెలుసని, కాబట్టి షో చూసి జడ్జ్ చేయనని రవికి కితాబిచ్చాడు. ఇక మరో కంటెస్టెంట్ విశ్వ పైకి చాలా పహిల్వాన్‌లా కనిపించినా తను చాలా ఎమోషనల్ పర్సన్ అని, బయట కూడా అతను అలాగే ఉంటాడని చెప్పుకొచ్చాడు.