నీచంగా మాట్లాడిన గౌతమ్‌.. కొంపముంచేంత పని చేసిన నబీల్‌! | Bigg Boss 8 Telugu December 2nd Full Episode Review And Highlights: Race For Second Finalist To Contestants | Sakshi
Sakshi News home page

Bigg Boss 8 Dec 2nd Highlights: దిగజారిపోయి మాట్లాడిన గౌతమ్‌.. రూ.15 లక్షలు ఖర్చుపెట్టేందుకు వెనకాడని నబీల్‌

Published Mon, Dec 2 2024 11:36 PM | Last Updated on Tue, Dec 3 2024 1:42 PM

Bigg Boss Telugu 8, Dec 2nd Episode Highlights: Race for Second Finalist

నిన్నమొన్నటివరకు కిచెన్‌లో ఎంత సేపు వంట చేసుకోవాలన్నది బిగ్‌బాసే డిసైడ్‌ చేసేవాడు. గంట, రెండు గంటలు మాత్రమే టైమ్‌ ఇచ్చేవాడు. సీజన్‌ ముగింపుకు వచ్చేసిన సందర్భంగా కిచెన్‌ టైమర్‌ను అన్‌లిమిటెడ్‌ చేసేశాడు. నామినేషన్స్‌ లేకపోయినా అలాంటి ఓ ప్రక్రియ పెట్టడంతో గౌతమ్‌, నిఖిల్‌ రెచ్చిపోయి మాట్లాడుకున్నారు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (డిసెంబర్‌ 2) ఎపిసోడ్‌ హైలైట్స్‌లో చదివేయండి..

రోహిణిని ఆటపట్టించిన గౌతమ్‌
చాలాకాలంగా మనసులో దాచుకున్న మాటను చెప్పేస్తున్నానంటూ రోహిణి దగ్గర తెగ సిగ్గుపడిపోయాడు గౌతమ్‌. కానీ నోరు తెరుస్తూనే.. ఈ హౌస్‌లో ఉన్న అమ్మాయిలందరూ నా అక్కలు. ఓ సహోదరుడిగా నీకు ఎల్లప్పటికీ తోడుగా, నీడగా ఉంటాను అని చెప్పాడు. ఆ మాటతో అవాక్కయిన రోహిణి.. ఎవడ్రా నీకు అక్క అంటూ గౌతమ్‌ను సరదాగా తిట్టిపోసింది.

సెకండ్‌ ఫైనలిస్ట్‌ ఎంపిక
తర్వాత బిగ్‌బాస్‌.. ఫస్ట్‌ ఫైనలిస్ట్‌ అవినాష్‌ మినహా మిగతా అందరూ నేరుగా నామినేట్‌ అయినట్లు ప్రకటించాడు. రెండో ఫైనలిస్ట్‌ ఎంపిక కోసం ఓ టాస్క్‌ పెట్టాడు. ఎవరైతే ఫినాలేలో ఉండకూడదనుకుంటున్నారో వారి ఫోటోను కాల్చేయాలన్నాడు. చివరకు ఎవరి ఫోటో అయితే కాలకుండా ఉంటుందో వాళ్లు సెకండ్‌ ఫైనలిస్ట్‌ అవుతారని చెప్పాడు. మొదటగా అవినాష్‌.. విష్ణుప్రియ ఫోటో కాల్చేశాడు. విష్ణుప్రియ వంతురాగా.. ఎవరితోనూ ఎక్కువగా కలవట్లేదు, నీ గేమ్‌ అర్థం కావట్లేదంటూ గౌతమ్‌ ఫోటో కాల్చేసింది. 

అమ్మాయిలను వాడుకున్నావ్‌
గౌతమ్‌.. పదేపదే పోట్రే చేస్తున్నానని నాపై లేనిపోని నింద వేశావంటూ నిఖిల్‌ను రేసులో నుంచి తీసేయాలనుకున్నాడు. నిఖిల్‌ స్పందిస్తూ.. వచ్చినప్పటినుంచి నువ్వు అదే చేస్తున్నావని వాదనకు దిగాడు. ఈ క్రమంలో గౌతమ్‌.. యష్మిని వాడుకుంది నువ్వు, అమ్మాయిలను వాడుకున్నావ్‌ అంటూ నీచంగా మాట్లాడాడు. ఇలానే మరోసారి కాస్త వల్గర్‌గా మాట్లాడటంతో నిఖిల్‌ కోపాన్ని అణుచుకోలేకపోయాడు. ఇంకోసారి నోరు జారి మాట్లాడితే బాగోదని హెచ్చరించాడు.

రోహిణిని తప్పించిన నిఖిల్‌
ఈ గొడవను ఆపేయమని చెప్తున్నా కూడా.. గౌతమ్‌ వినకుండా విషయాన్ని సాగదీస్తూనే ఉన్నాడు. యష్మికి గాజులు సెట్‌ చేస్తూ ఆమెకు హోప్స్‌ పెట్టడం తప్పంటూ తన వ్యక్తిగత విషయాలను ప్రస్తావించి మరింత ఇరిటేషన్‌ తెప్పించాడు. అనంతరం నిఖిల్‌.. నామినేషన్స్‌లోకి రాలేదంటూ రోహిణిని రేసు నుంచి తప్పించాడు. నామినేషన్స్‌లోకి రాకపోయినా నేను అన్ని గేమ్స్‌ గట్టిగానే ఆడాను అని రోహిణి సమాధానమిచ్చింది. చివర్లో ప్రేరణ, నబీల్‌.. ఇద్దరు మాత్రమే మిగిలారు. వీరికి బిగ్‌బాస్‌ బంపరాఫర్‌ ఇచ్చాడు. 

ఇమ్యూనిటీ కొనుక్కోవాలన్న బిగ్‌బాస్‌
మీ ముందున్న చెక్‌పై రూ.15 లక్షల వరకు ఎంతైనా రాసి ఇమ్యూనిటీ కొనుక్కోవచ్చన్నాడు. ఆ డబ్బు విన్నర్‌ ప్రైజ్‌మనీలో నుంచి కట్‌ అవుతాయన్నాడు. కాసేపు ఆలోచించుకున్నాక ఇద్దరూ తమకు తోచినంత అమౌంట్‌ రాశారు. ఇంతలో మరో ట్విస్ట్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఇమ్యూనిటీ కొనుక్కోకుండా వారిని నామినేషన్స్‌లో ఉంచేందుకు హౌస్‌మేట్స్‌ ఒప్పించవచ్చన్నాడు.

చెక్కులు చింపేయమన్న హౌస్‌మేట్స్‌
ప్రైజ్‌మనీని ఒక్కో రూపాయి సంపాదిస్తూ ఇక్కడివరకు తేవడానికి అందరం ఎంతో కష్టపడ్డాం. మీకు జనాలు ఓటు వేశారు కాబట్టే పద్నాలుగోవారం దాకా వచ్చారు అని నిఖిల్‌ చెక్‌ చించేయమన్నాడు. మిగతావాళ్లు కూడా అదే సలహా ఇచ్చి ఎలాగోలా ఒప్పించడంతో ప్రేరణ, నబీల్‌.. ఫైనలిస్ట్‌ స్థానాన్ని కొనుక్కోవాలనుకోవడం లేదని చెప్పారు. రాసిన చెక్కులు చింపేయడానికంటే ముందు ఇద్దరు ఎంత రాశారో చెప్పాలన్నాడు. 

నబీల్‌ స్వార్థం
ప్రేరణ.. రూ.4,30,000 రాయగా నబీల్‌ ఏకంగా రూ.15 లక్షలు రాసేశాడు. అది విని హౌస్‌మేట్స్‌ నోరెళ్లబెట్టారు. కంటెస్టెంట్లే కాదు చూసే జనాలు కూడా వీళ్లు ఇంత స్వార్థంగా ఉన్నారేంటని ఈసడించుకోవడం ఖాయం. ఏదేమైనా వీరిద్దరూ మనసులు మార్చుకుని చెక్కులు చించేయడంతో నేరుగా ఫైనల్‌కు వెళ్లే అవకాశం కోల్పోయారు. ఈ వారం గౌతమ్‌, రోహిణి, నిఖిల్‌, విష్ణుప్రియ, ప్రేరణ, నబీల్‌ నామినేషన్స్‌లో ఉన్నారు.

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement