నటుడు హృషికేశ్ పాండే అంటే ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చేమో కానీ సీఐడీ షోలో ఇన్‌స్పెక్టర్ సచిన్ అంటే మాత్రం ఇట్టే గుర్తుపడతారు. సీఐడీ సిరీస్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు హృషికేశ్. ఈ షోలో ఎన్నో కేసులను ఇట్టే చేధించే ఈయన ఇటీవల తన పర్సు, క్రెడిట్ కార్డు, ఇతరత్రా వస్తువులను పోగొట్టుకున్నాడట.
అదెలాగో ఆయనే మాటల్లోనే.. 'జూన్ 5న నేను, నా ఫ్యామిలీతో కలిసి మహారాష్ట్రలోని ఎలిఫెంటా కేవ్స్ సందర్శించాం. ఆ తర్వాత కొలబా నుంచి టార్డియోకు వెళ్లేందుకు ఓ ఏసీ బస్సు ఎక్కాం. సాయంత్రం ఆరున్నర గంటలకు బస్సు దిగాము. అప్పుడు నా బ్యాగ్ చూసుకోగా అందులో నా డబ్బులు, క్రెడిట్ కార్డులు, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇతరత్రా వస్తువులు కనిపించకుండా పోయాయి. దీంతో వెంటనే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. రీల్ లైఫ్‌లో సీఐడీ ఇన్‌స్పెక్టర్‌గా పని చేసిన నేను ఎన్నో కేసులను చేధించాను. రియల్ లైఫ్‌లో కూడా చాలామంది వారి సమస్యలను నా వద్ద చెప్పుకుంటూ వాటిని పరిష్కరించమని కోరేవారు. నేను నాకు చేతనైనంత సాయం చేసేవాడిని. కానీ ఇప్పుడు నా దగ్గరే కొట్టేశారు. ఇదంతా ఏదో జోక్‌గా అనిపిస్తుండొచ్చు. ఏదేమైనా పోలీసులు వీలైనంత త్వరగా ఈ కేసు సాల్వ్ చేస్తారని ఆశిస్తున్నాను' అని చెప్పుకొచ్చాడు.
కాగా ఇటీవలే సీఐడీ బృందం ఒకేచోట చేరి పార్టీ చేసుకుంది. దయానంద్ శెట్టి(ఇన్‌స్పెక్టర్ దయ), ఆదిత్య శ్రీవాత్సవ (సీనియర్ ఇన్‌స్పెక్టర్ అభిజీత్), దినేశ్ ఫడ్నీస్ (ఇన్‌స్పెక్టర్ ఫ్రెడ్రిక్స్), శ్రద్ధ మూసలే (డాక్టర్ సారిక), జాన్వీ చెడ (ఇన్‌స్పెక్టర్ శ్రేయ), అజయ్ నాగ్రత్ (సబ్ ఇన్‌స్పెక్టర్ పంకజ్) గెట్ టు గెదర్ ఏర్పాటు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment