నటుడి సాహసం.. ఆ పాత్ర కోసం 15 రోజులు ఆహారం లేకుండా..! | Sakshi
Sakshi News home page

Aadujeevitham Movie: మూడు రోజులకే కుప్పకూలిపోయా.. చాలా బాధపడ్డారు!

Published Tue, Apr 9 2024 8:44 PM

The Goat Life actor KR Gokul says he collapsed on 3rd day in sets - Sakshi

సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన చిత్రం 'ఆడుజీవితం: ది గోట్ లైఫ్'. బ్లెస్సీ  డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా కోసం పృథ్వీరాజ్‌ చాలా కష్టపడినట్లు ఇటీవల ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. అలాగే ఈ సినిమాలో మరో నటుడు కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రంలో హకీమ్ అనే పాత్రలో కేఆర్‌ గోకుల్‌ కనిపించారు.  అతని శరీరం పూర్తిగా బక్కచిక్కపోయినట్లుగా ఈ సినిమాలో కనిపించారు. తాజాగా తన బాడీని అలా మార్చేందుకు పడిన కష్టాన్ని పంచుకున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్‌ లాగే గోకుల్ పాత్ర కోసం తీవ్రంగా శ్రమించారు. దాదాపు కొన్ని రోజుల పాటు ఆహారం తినకుండా ఉన్నట్లు వెల్లడించారు.  

గోకుల్ మాట్లాడుతూ..'హకీమ్ పాత్ర కోసం బరువు తగ్గడానికి ప్రయోగాలు చేశా. ఆ పాత్రను వాస్తవికంగా పోషించడంలో నాకు సహాయపడింది. ఇది నన్ను శారీరకంగా, మానసికంగా దెబ్బతీసింది. కేవలం నీళ్లు తాగి బతికా. దీంతో బాడీలోని కేలరీలను క్రమంగా తగ్గించుకున్నా. 15 రోజులుగా ఏం తినకుండా కేవలం బ్లాక్ కాఫీ తాగాను. దీంతో మూడో రోజే ఒక్కసారిగా కుప్పకూలిపోయాను. నా పరిస్థితిని చూసి నా కుటుంబం, స్నేహితులు చాలా బాధపడ్డారు. ఇది నిజంగా నా మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. ఆడుజీవితం సెట్స్‌లో నేనే అందరికంటే చిన్నవాడిని' అని అన్నారు. 

పృథ్వీరాజ్‌తో  అనుభవం గురించి మాట్లాడుతూ..'షూటింగ్ సమయంలో అందరూ నన్ను తమ కొడుకులా చూసుకున్నారు. ఆ విధమైన శ్రద్ధ ఎల్లప్పుడూ సెట్స్‌లో సౌకర్యవంతంగా ఉండేందుకు సహాయపడింది. మనం సౌకర్యవంతంగా ఉన్నప్పుడు స్వేచ్ఛగా పని చేయగలం. పృథ్వీరాజ్ నన్ను కొత్తవాడిగా కాకుండా సహానటుడిగా చూశాడు. నువ్వు నాలాగే బాగా పని చేస్తున్నావు అని నాతో చెప్పాడు' అని పంచుకున్నారు.

కాగా.. బెన్యామిన్ రచించిన 2008 నవల ఆడుజీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 1990ల్లో పని కోసం గల్ఫ్‌కు వలస వెళ్లిన కేరళకు చెందిన నజీబ్ అనే వ్యక్తి జీవితం ఆధారంగా రూపొందించారు. ఇటీవలే ధియేటర్లలో విడుదలైన ఆడు జీవితం ప్రపంచవ్యాప్తంగా  రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది.

Advertisement
Advertisement