
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా వారుసురాలు, గాయనీ, సంగీతదర్శకురాలు భవతారిణి కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో కన్నుమూశారు. కాగా ఆమె చివరిగా సంగీతాన్ని అందించిన తమిళ చిత్రం 'పుయలిల్ ఒరు ధోనీ' త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈశన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నూతన తారలు విష్ణుప్రకాశ్, అర్చనాసింగ్ హీరోహీరోయిన్లుగా నటించారు.
ఈ చిత్ర వివరాలను మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో దర్శకుడు వెల్లడిస్తూ.. మహిళల గొంతుకగా ఈ చిత్రం ఉంటుందన్నారు. తాను కథను సిద్ధం చేసుకున్నప్పుడే భవతారిణే దీనికి సంగీతాన్ని అందించాలని నిర్ణయించుకున్నానన్నారు. చిత్ర షూటింగ్‌ను పూర్తి చేసిన తరువాత భవతారిణిని కలిసి చిత్రాన్ని చూపించానన్నారు. చిత్రం నచ్చడంతో ఆమె సంగీతాన్ని అందించడానికి అంగీకరించినట్లు చెప్పారు. ఇందులో రెండు పాటలు ఉంటాయని, రెండింటినీ గీత రచయిత స్నేహన్ రాశారని చెప్పారు.
ఈ పాటలకు భవతారిణి చాలా వేగంగా సంగీతాన్ని సమకూర్చారన్నారు. ఇందులో ఓ పాటను సంగీత దర్శకుడు జీవీ.ప్రకాశ్‌కుమార్ ,మానసీ కలిసి పాడారని, మరో పాటను సంగీత దర్శకుడు కార్తీక్‌రాజా పాడారని చెప్పారు. రెండు పాటలు చాలా బాగా వచ్చాయని, ఇవి సంగీత ప్రియులకు కచ్చితంగా నచ్చుతాయన్నారు. నేపథ్య సంగీతాన్ని చాలా బాగా రూపొందించారని, త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న ఈ పుయలిల్ ఒరు ధోని చిత్ర విజయాన్ని సంగీతదర్శకురాలు భవతారిణికి అంకితం చేస్తామని దర్శకుడు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment