చిత్ర పరిశ్రమపై ఆదాయ పన్నుశాఖ అధికారులు గురి పెట్టారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో విడుదలైన చిత్రాలకు సంబంధించిన నిర్మాతలు, దర్శకుల ఇళ్లు, ఆఫీసులలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పుష్ప2 డైరెక్టర్ సుకుమార్ నివాసంలో కూడా నేడు ఐటి సోదాలు జరుగుతున్నాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి సుకుమార్‌ను ఐటీ అధికారులు నేరుగా ఇంటికి తీసుకెళ్లారు. ఆయనకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలు, లాకర్లు వంటి వివరాల గురించి ఆరా తీస్తున్నారు.
ఇప్పటికే ప్రముఖ గాయని సునీత భర్త రామ్‌కు చెందిన మ్యాంగో మీడియా సంస్థలోనూ ఐటీ సోదాలు కొనసాగినట్టు తెలిసింది. అంతేకాదు భారీ బడ్జెట్ సినిమాలకు ఫైనాన్స్ చేసే సత్య రంగయ్య, అభిషేక్ అగర్వాల్‌ల ఇళ్లలోనూ సోదాలు చేశారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే మొదలైన ఈ ప్రక్రియే రెండో రోజు కూడా కొనసాగుతుంది. గత రెండు నెలల్లో విడుదలైన చిత్రాలకు సంబంధించిన వారినే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి సహా నగరంలోని ఎనిమిది చోట్ల 55 బృందాలతో తనిఖీలు నిర్వహించినట్టు సమాచారం.
దిల్ రాజ్ కూతురు ఇంట్లో సోదాలు
దిల్ రాజ్ కూతురు హన్సితారెడ్డి ఇంట్లో కూడా రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆమె సమక్షంలో డిజిటల్ లాకర్లను ఐటి అధికారులు ఓపెన్ చేశారు. మరికొద్ది సేపట్లో ఆమెకు సంబంధించిన బ్యాంకు లాకర్లను అధికారులు ఓపెన్ చేయనున్నారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ లోని ఆమె నివాసానికి హన్సితా రెడ్డి కుటుంబ సభ్యులు చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment