‘దేవర’..ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చిస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రమిది. జనతా గ్యారేజ్‌తో ఎన్టీఆర్‌కు బ్లాక్ బస్టర్ హిట్ అందించిన కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. జాన్వీ కపూర్ హీరోయిన్. సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషించాడు. సెప్టెంబర్ 27న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు నెట్టింట వైరల్ అతున్నాయి. గతంలో ఎన్టీఆర్ ఏ సినిమాకు రానంత బజ్ దేవరకు క్రియేట్ అయింది. దానికి గల కారణం ఏంటి? దేవర ప్రత్యేకతలు ఏంటి? ఒక్కసారి చూద్దాం.
→ ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన చివరి చిత్రం ‘ఆరవింద సమేత వీరరాఘవ’. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆరేళ్ల క్రితం విడుదలైంది. ఆ తర్వాత రామ్ చరణ్‌తో కలిసి ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలో నటించాడు. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఇప్పుడు ‘దేవర’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆర్‌ఆర్‌ఆర్ బ్లాక్ బస్టర్ హిట్ కావడం.. ఆరేళ్ల గ్యాప్ తర్వాత సోలో హీరోగా వస్తుండడంతో ‘దేవర’పై భారీ అంచనాలు పెరిగాయి.
→ ఈ చిత్రంలో అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఉంటుందని చాలా రోజుల క్రితమే పుకార్లు వచ్చాయి. విజయ్ దేవరకొండ సినిమాతో ఎంట్రీ ఇస్తుందని అంతా అనుకున్నారు. అయితే ఎన్టీఆర్ సరసన నటించే చాన్స్ రావడంతో జాన్వీ వెంటనే ఓకే చెప్పిందట. ‘దేవరలో నటించాలని జాన్వీ కూడా అనుకుందట. మేకు కూడా అనుకోకుండా ఆమెనే అప్రోచ్ అయ్యాం. సెట్‌లో ఆమెను చూస్తే అచ్చం తెలుగమ్మాయిలాగే అనిపించేంది. ప్రతి సీన్, డైలాగ్ ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేసి సెట్‌పైకి వచ్చేది’అని ఓ ఇంటర్వ్యూలో కొరటాల శివ అన్నారు. ఇందులో ఆమె ‘తంగం’అనే పాత్ర పోషించారు.
→ జాన్వీతో పాటు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న మరో నటుడు సైఫ్ అలీఖాన్. ఇందులో ‘భైర’ అనే పాత్రలో నటించాడు. ఎన్టీఆర్ పాత్రకు ధీటుగా సైఫ్ అలీఖాన్ పాత్ర తీర్చిదిద్దారట కొరటాల. పార్ట్ 1 కంటే పార్ట్ 2 ఆయన పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుందని టాక్
→ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమా నెరేషన్ చేయడానికి దాదాపు నాలుగు గంటల సమయం పట్టిందట. మొదట్లో ఒకే పార్ట్‌గా సినిమా తీయాలని భావించారట. అయితే కొంత షూటింగ్ పూర్తయిన తర్వాత ఇంత పెద్ద కథను మూడు గంటల్లో చెప్పడం కష్టమని భావించి రెండు భాగాలు రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారట.
→ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్న నాలుగో సినిమా ఇది. అంతకు ముందు ‘ఆంధ్రావాలా’, ‘అదుర్స్’, ‘శక్తి’ సినిమాల్లో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ చేశాడు. దేవరలో దేవర, వర అనే రెండు పాత్రల్లో ఎన్టీఆర్ నటించాడు.
→ హాలీవుడ్ రేంజ్‌లో ఈ సినిమాను తీర్చిదిద్దాడట కొరటాల. ‘‘దేవర’ సినిమా చూస్తున్నప్పుడు మీకు ‘అవెంజర్స్’, ‘బ్యాట్‌మ్యాన్’ వంటి హాలీవుడ్ సినిమాలు చూసిన అనుభూతి కలుగుతుంది’ అని సంగీత దర్శకుడు అనిరుధ్ చెబుతున్నాడు.
→ చివరి 40 నిమిషాల్లో వచ్చే సన్నివేశాలు గూస్‌బంప్స్ తెప్పిస్తాయట. అండర్ వాటర్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ అని మేకర్స్ చెబుతున్నారు. ఈ సన్నివేశాల చిత్రీకరణ కోసం ఎన్టీఆర్ ప్రత్యేక శిక్షణ తీసుకున్నారట.
→ ఈ సినిమా కోసం 200చదరపు గజాల్లో సముద్రం సెట్ వేశారట. 35 రోజుల పాటు అక్కడే షూట్ చేశారట. ట్రైలర్‌లో చూపించిన షార్క్ షాట్ తీయడానికి ఒక రోజు సమయం పట్టిందని కొరటాల చెప్పారు.
→ ఈ సినిమాలో వాడిన పడవలను ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ ప్రత్యేకంగా డిజైన్ చేశారు. అప్పటి కాలంనాటి పరిస్థితులకు అద్దం పట్టేలా ఈ పడవలను తీర్చిదిద్దారు. నిజమైన సముద్రంలోనూ ఈ పడవలలో ప్రయాణం చెయ్యొచ్చట.
→ ఈ సినిమాలో ఎన్టీఆర్ తన పాత్రకు నాలుగు భాషల్లో డబ్బింగ్ చెప్పారు. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ్‌లో స్వంతంగా డబ్బింగ్ చెప్పారు.
→ ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను షూట్ చేయడం కోసం సినిమాటోగ్రాఫర్ రత్నవేలు చాలా కష్టపడ్డారట. ముఖ్యంగా నైట్ ఎఫెక్ట్ కోసం అతి తక్కువ వెలుతురులో షాట్స్ తీయడం చాలా కష్టమైందని రత్నవేలు చెప్పారు.
→ ఇందులో దేవర భార్యగా మరాఠి నటి శ్రుతి మరాఠే నటించింది. అయితే ఆమె పాత్రను మాత్రం ప్రచార చిత్రాల్లో చూపించకుండా సస్పెన్స్ కొనసాగిస్తున్నారు.
→ ఇక విడుదలకు ముందే ఈ చిత్రం చాలా రికార్డులను క్రియేట్ చేసింది. ఓవర్సీస్‌లో ప్రీసేల్‌లో అత్యంత వేగంగా ఒక మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిన చిత్రమిదే. లాస్ ఏంజిల్స్‌లో జరుగుతున్న బియాండ్ ఫెస్ట్‌లో ప్రదర్శితం కానున్న తొలి భారతీయ చిత్రం దేవర. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో అత్యధిక సంఖ్యలో డాల్బీ అట్మాస్ షోలను ప్రదర్శించనున్న తొలి భారతీయ చిత్రంగానూ నిలిచింది. ఇక యూట్యూబ్‌లో అత్యంత వేగంగా 100 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకున్న పాటగా ‘చుట్టమల్లే..’ నిలిచింది.
→ ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ.400 కోట్లు. ఎన్టీఆర్ రూ.60 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకున్నారట. ప్రీరిలీజ్ బిజినెస్, ఓటీటీ అమ్మకంతో దాదాపు రూ. 350 కోట్ల వరకు రికవరీ అయిందట. ఇంకా శాటిలైట్ అమ్మకాలు జరగనట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment