టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా 'టైగర్ నాగేశ్వరరావు' విడుదలకు రెడీగా ఉంది. వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. సినిమా రన్‌టైమ్ 3.02 గంటలు ఉంది. నిడివి ఎక్కువగా ఉన్నా ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు.
(ఇదీ చదవండి: సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి)
1970ల్లో స్టూవర్టుపురంలో పేరు మోసిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రంలో చాలా ఏళ్ల తర్వాత నటి రేణు దేశాయ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. భారీ అంచనాలతో విడుదల అవుతున్న టైగర్ నాగేశ్వరరావు చిత్రానికి థియేటర్ కష్టాలు ఏర్పడ్డాయి. దీంతో రవితేజ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
కేవలం 30 లోపు థియేటర్లే
తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో టైగర్ నాగేశ్వరరావు చిత్రానికి థియేటర్లు దొరకడం లేదని తెలుస్తోంది. ఈ సినిమా విడుదలకు ఒక్కరోజు ముందు అక్టోబర్ 19న విజయ్ 'లియో' థియేటర్లలోకి వస్తోంది. దీంతో తమిళనాడులోని అన్ని థియేటర్లు విజయ్ సినిమాకే ప్రథమ ప్రయారిటీ ఇచ్చాయి. దీంతో తమిళనాడులో రవితేజ చిత్రానికి కేవలం 30లోపు థియేటర్లు మాత్రమే మిగిలాయట. అవి కూడా అంత చెప్పుకోతగిన థియేటర్లు కాదని సమాచారం. ఇకపోతే కర్ణాటకలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో రవితేజ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
తెలుగులోనూ రవితేజకు ఎదురుదెబ్బే...
'లియో' సినిమాను తెలుగులో సితార ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ విడుదల చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని ఈ సినిమా సుమారు రూ.22 కోట్లకు థియేట్రికల్ రైట్స్ విక్రయించారని టాక్ ఉంది. ఒక రకంగా విజయ్ కెరీర్‌లో ఇదే అత్యధిక తెలుగు బిజినెస్ అని సమాచారం. దీంతో తెలుగులో కూడా ‘లియో’కి అత్యధిక థియేటర్లు కేటాయింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 'లియో' సినిమా వల్ల బాలకృష్ణ 'భగవంత్ కేసరి' థియేటర్లు తగ్గించమని సితార ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ గతంలో చెప్పారు.
కానీ ఈ రెండు సినిమాలు విడుదలైన ఒక్కరోజు తర్వాత వస్తోన్న 'టైగర్ నాగేశ్వరరావు'కు మాత్రం భారీ దెబ్బే తగలబోతున్నట్లు తెలుస్తోంది. రవితేజ సినిమా కన్నా 'లియో'కే తెలుగులో ఎక్కువ థియేటర్లు ఇచ్చినట్లు సమాచారం. దీంతో రవితేజ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవుతున్నారు. తమిళనాడులో తెలుగు సినిమాకు థియేటర్లే ఇవ్వనప్పుడు అక్కడి సినిమాలకు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా థియేటర్లు కేటాయించడం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాకు జరుగుతున్న అన్యాయాన్ని నిర్మాత అభిషేక్ అగర్వాల్ ప్రశ్నించాలని రవితేజ ఫ్యాన్స్ కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment