అజహరుద్దీన్.. క్రికెట్‌లో ఓ కొత్త చరిత్ర!
సంగీతా బిజ్‌లానీ.. బాలీవుడ్ తెర మీద మెరిసిన ఒక కొత్త మోడల్!
ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. అప్పటికే అజహర్ వివాహితుడు.. ఇద్దరు పిల్లల తండ్రి కూడా. సంగీతా బిజ్‌లానీది శుభలేఖల దగ్గరే ఆగిపోయిన పెళ్లి. ఆ విరిగిన మనసుకు మళ్లీ ప్రేమతో సాంత్వననిచ్చాడు అజహర్. అదీ శుభం కార్డ్ వేసుకోలేకపోయింది.
క్రికెటర్ అజహర్ కంటే ముందు సంగీతా జీవితంలో నటుడు సల్మాన్ ఖాన్ ఉన్నాడు తన ప్రేమ వర్తమానాన్ని అందించి. కెరీర్‌లో సల్మాన్ కంటే సంగీతానే సీనియర్. ఆమె అందమో.. అభినయమో.. సల్మాన్‌ను ఆకట్టుకుంది. సంగీతా అంటే ఇష్టం ఏర్పడింది. అదే విషయం ఆమెతో చెప్పాడు. ఆశ్చర్యపోయింది. ‘నువ్వంటే నాకిష్టం.. ఒట్టు.. నన్ను నమ్ము’ అన్నాడు అతను. ఆ అభ్యర్థనలో నిజాయితీ కనిపించింది.. వినిపించింది. ‘సరే’ అంది మది నిండా నమ్మకాన్ని నింపుకుంటూ.. కళ్లతో ప్రేమను కురిపిస్తూ! అలా ఆరంభమైన ఆ డేట్ దాదాపు పదేళ్లు కొనసాగింది. ఆ విషయం బాలీవుడ్‌లో వార్తవడమూ.. దాన్ని సినిమా పత్రికలు మోయడమూ సాధారణమే కదా!
నిశ్చితార్థం జరిగింది.. కానీ సల్మాన్ మరో అమ్మాయితో..
వాళ్ల ప్రేమ... పెళ్లి ప్రస్తావననూ తెచ్చింది. దానికి నిశ్చితార్థమూ జరిగింది. శుభలేఖలూ అచ్చయ్యాయట. మరి పెళ్లి సందడి మొదలవలేదు ఎందుకు?సంగీతాను కాదని సల్మాన్ ఇంకో అమ్మాయి ప్రేమలో పడ్డాడు. ఆ నిజం సంగీతాకు చెప్పే ధైర్యం చేయలేదు. ఆమెకు తెలియకుండా జాగ్రత్తపడే ప్రయత్నం చేశాడు. కానీ అనుకోకుండా ఆ అమ్మాయితో సంగీతా కంటపడ్డాడు. ‘నా పట్ల నీ ప్రేమ నిజమని నమ్మమన్నావ్?’ కళ్లతోనే నిలదీసింది సంగీతా. సమాధానం లేక తలవంచుకున్నాడు సల్మాన్. అందుకే ఆ పెళ్లి పీటలెక్కలేదు. సల్మాన్ నమ్మకద్రోహాన్ని తట్టుకోలేకపోయింది సంగీతా.
ఇద్దరు పిల్లల తండ్రితో సంగీత.. ప్రేమను వెతుక్కుంది
ఆ సమయంలోనే అజహరుద్దీన్‌తో ఓ యాడ్ షూట్ చేస్తోంది సంగీతా. తొలిచూపులోనే ఆమెకు ఫిదా అయిపోయాడు అజహర్. ప్రణయంతోనే మొదలైంది ఆ పరిచయం. దాంతో ఆ యాడ్ షూటింగ్ అయిపోయాకా కలుసుకోవడం మొదలుపెట్టారు ఇద్దరూ. ఏ సినిమా ఈవెంట్‌కైనా అజహర్‌తోనే హాజరవ సాగింది సంగీతా. అజహర్ కూడా సంగీతా తోడు లేనిదే.. రానిదే పేజ్ త్రీ పార్టీకి అటెండ్ అయ్యేవాడు కాదు. లైఫ్ స్టయిల్ కాలమ్స్ అన్నీ వాళ్ల కబుర్లతోనే కడుపునింపుకొనేవని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా! అయితే.. అప్పటికే అజహరుద్దీన్‌కు పెళ్లయి, ఇద్దరు పిల్లల కూడా ఉండడంతో ఆ ప్రేమ వివాదాస్పదంగా మారింది.
భార్యకు తలాక్ చెప్పి..సంగీత చేయి అందుకున్నాడు
అజహర్ భార్య నౌరీన్‌కు మనస్తాపాన్ని కలిగించింది. కానీ సంగీతా పట్ల తన ప్రేమ విషయంలో అజహర్ మాత్రం ఒక స్పష్టతతోనే ఉన్నాడు. తతిమా జీవితాన్ని ఆమెతోనే పంచుకోవాలనుకున్నాడు. ఆ నిజాన్నే నౌరీన్‌కు చెప్పాడు. బాధపడింది. ఏడ్చి, ఏడిపించి ప్రేమను లాక్కోలేమని గ్రహించింది నౌరీన్. అజహర్ తలాక్ ప్రపోజల్‌ను మన్నించింది. అతని వైవాహిక జీవితంలోంచి పక్కకు తప్పుకుంది. సంగీతా చేయి అందుకున్నాడు అజహర్.అప్పటి నుంచి అతని అడుగులో అడుగైంది సంగీతా. అతని కెరీర్ ఒడిదుడుకుల్లో కొండంత ధైర్యంగా నిలబడింది. అతని వ్యక్తిగత దుఃఖాలకు ఓదార్పుగా మారింది. అజహర్ చుట్టే ప్రపంచాన్ని అల్లుకుంది. అతని ఆనందానికి నిమిత్తమైంది. తన నిమిత్తంలేని అతని బాధను పంచుకుంది. అలా పద్నాలుగేళ్లు సాగింది వాళ్ల కాపురం.
అదీ బ్రేక్ అయింది
దానికీ కారణం నమ్మకద్రోహమే! నౌరీన్‌ను కాదని తనతో ప్రేమలో పడ్డట్టే తనను మరచి మరో అమ్మాయితో అజహర్ ప్రేమలో పడ్డాడని సంగీతా మనసులో బాధ. అది అపోహ మాత్రమే అంటాడు అజహర్. ఎవరిది నిజమో.. ఎవరిది అపోహో ఆ ఆలుమగలకే తెలియాలి. ప్రేమ పంచాయతీకొచ్చిందనేది మాత్రం బయటవాళ్లెరిగిన సత్యం. ఎట్టకేలకు ఆ ప్రేమ విడాకులతో చిత్తగించింది.
సంగీతా ఒంటరిగా మిగిలింది. తన బ్లాగ్ రచనలో తలమునకలైంది. ‘ప్రేమలో పడిన మాటను బయటకెవరూ చెప్పుకోరు కానీ నేను చెప్తున్నాను.. తొలిచూపులోనే సంగీతాతో ప్రేమలో పడ్డా. ఇది నిజం’ అని చెప్పాడు అజహరుద్దీన్ ఒక ఇంటర్వ్యూలో. ‘మగవాళ్లెప్పుడూ పలాయనవాదులే. తమ అసంతృప్తులు, ఇబ్బందులకు వైవాహిక బంధానికి ఆవల పరిష్కారాన్ని వెదుక్కోవాలనుకుంటారు’ అని తన బ్లాగ్‌లోని ఓ వ్యాసంలో రాసుకుంది సంగీతా.
ఎస్సార్
Comments
Please login to add a commentAdd a comment