కల్పనా రాయ్.. ఈ పేరు చెప్తే చాలు చాలామంది పెదాలపై వారికి తెలియకుండానే చిరునవ్వు వస్తుంది. తరతరాలకు సరిపడేంత నవ్వులు పంచి వెళ్లిపోయింది ఈ మహానటి. తన యాసతో డైలాగ్‌కే వన్నె తెచ్చిన ఈమె 430కు పైగా చిత్రాల్లో నటించింది. జంబలకిడి పంబ, ప్రేమించుకుందాం రా, కలిసుందాం రా.. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని గుర్తుండిపోయే సినిమాలు చేసింది. వందల సినిమాలు చేసిన ఈ నటి చివరి రోజుల్లో మాత్రం ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడింది. అంత పెద్ద నటికి అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? తన చివరి రోజుల్లో ఏం జరిగింది? అనేది ఈ కథనంలో చదివేద్దాం..
తెలుగింటి ఆడపడుచు
కల్పనా రాయ్ తెలుగింటి ఆడపడుచు. 1950లో కాకినాడలో జన్మించింది. ఆమె అసలు పేరు సత్యవతి. యుక్తవయసులో ఆమె ఎంతో అందంగా ఉండేది. ఒంటినిండా బంగారు నగలు వేసుకుని ఆమె నడిచి వస్తుంటే చూడటానికి రెండు కళ్లు చాలేవి కాదట! 'నీడలేని ఆడది' సినిమాతో వెండితెరపై రంగప్రవేశం చేసింది కల్పన. కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వందల కొద్దీ సినిమాలు చేసింది. అందరికీ తనే స్వయంగా అన్నం వండి వడ్డించేది. కో డైరెక్టర్లు సహా ఎంతోమంది ఆమె చేతివంట తిని కడుపు నింపుకునేవాళ్లు.
వెన్నలాంటి మనసు
ఎవరైనా బాధలో ఉన్నామని కన్నీళ్లు పెట్టుకుంటే చాలు క్షణం ఆలోచించకుండా తన చేతికి ఉన్న బంగారు గాజులను తీసి ఇచ్చేది. అంతటి దయామయురాలు కల్పనా రాయ్. తన దానధర్మాల వల్ల ఉన్న బంగారం, ఆస్తి అంతా కరిగిపోయినా ఆమె మాత్రం తీరు మార్చుకోలేదు. అప్పు చేసైనా సరే అందరికీ భోజనం పెట్టేది. ఆ మంచితనమే ఆమెకు శాపంగా మారింది. డబ్బు పోగానే అందరూ దూరమయ్యారు. దిగులు వల్లో మరింకేదో కానీ కల్పన లావెక్కింది.
కూతురు పారిపోవడంతో ఒంటరి
ఈ నటి ఎవరినీ పెళ్లి చేసుకోలేదు. ఒకమ్మాయిని దత్తత తీసుకుని పెంచుకుంది. కానీ ఆమె యుక్తవయసుకురాగానే ఒకరిని ప్రేమించి అతడితో పారిపోయింది. అప్పుడు కల్పన పడ్డ బాధ వర్ణణాతీతం. ప్రాణంగా ప్రేమించుకున్న కూతురు తనను మోసం చేసి వెళ్లిపోవడాన్ని తట్టుకోలేక తల్లడిల్లిపోయింది. అప్పుడే ఆమె మనిషిగా సగం చనిపోయింది. ఉన్న డబ్బు కూడా ఆవిరవడంతో పలకరించే నాధుడే కరువయ్యాడు. ఒంటరిగా మిగిలిపోయింది. చనిపోయేముందు దాదాపు పది రోజులపాటు తిండి లేక ఆకలికి అలమటించింది. తన శరీరం ఆకలికి తట్టుకోలేక హృదయ విదారక స్థితిలో ఆమె కన్నుమూసింది.
ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదు
'కల్పనా రాయ్ చనిపోయినప్పుడు ఆమె చితికి నిప్పు పెట్టడానికి కూడా డబ్బుల్లేని దుస్థితికి చేరుకుంది. ఆమె అతి మంచితనం వల్ల చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోయింది. ఇంతటి దుస్థితి ఏ ఆర్టిస్టుకూ రాకూడదు. కళామతల్లిని నమ్ముకున్న ఆమె చితి పేర్చేందుకు వేరేవాళ్లు డబ్బు సాయం చేస్తే కానీ ఆమె అంత్యక్రియలు జరగలేదు' అంటూ గతంలో ఓ ఇంటర్వ్యూలో కంటతడి పెట్టుకుంది నటి జయశ్రీ.
చదవండి: Sushmita Sen: పెళ్లి చేసుకుంటానంటే.. దేనికి? మాకైతే తండ్రి అక్కర్లేదంటున్నారు పిల్లలు..
Comments
Please login to add a commentAdd a comment