సాక్షి, హైదరాబాద్: వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. బుధవారం ఫిలించాంబర్ ఎదుట ఆందోళన చేపట్టిన సినీ కార్మికులు షూటింగ్‌లను సైతం బహిష్కరించారు. దీంతో హైదరాబాద్‌లో పరిసరాల్లో 20కిపైగా షూటింగ్‌లు జరుపుకుంటున్న తెలుగు, తమిళ, హిందీ చిత్రాల షూటింగ్‌లు నిలిచిపోయాయి. దీనిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం మాట్లాడుతూ.. సినీ కార్మికులలో అత్యధికంగా నిరుపేదలే ఉన్నారని, కరోనా సమయంలో షూటింగ్స్ లేక అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. సినీ కార్మికుల డిమాండ్స్ కూర్చొని పరిష్కరించుకోవాలని సూచించారు.
అయితే కరోనా కారణంగా చిత్రపరిశ్రమ తీవ్ర ఇబ్బందులలో ఉన్నందున రెమ్యునరేషన్ పెంచే విషయమై ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ అసోసియేషన్ ప్రతినిధులు గడువు కోరారని, కానీ ఆ గడువు ముగియడంతో వేతనాలు పెంచాలంటూ కార్మికులు సమ్మెకు దిగారని తెలిపారు. కార్మికులు చేపట్టిన ఆందోళన ఉదృతం కాకముందే సామరస్యపూర్వక వాతావరణంలో చర్చలు జరిపి 2,3 రోజులల్లో సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ అసోసియేషన్ ప్రతినిధులకు మంత్రి శ్రీనివాస్ యాదవ్ సూచించారు. ప్రభుత్వం జోక్యం చేసుకునేవరకు వేచి చూడొద్దని హితవు పలికారు.
మరోవైపు నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్ మాట్లాడుతూ.. 'సినీ కార్మికుల నిర్ణయం వల్ల నేడు చిత్ర పరిశ్రమ చాలా నష్టపోయింది. ఈ నెల 6వ తేదీన మాకు ఫెడరేషన్ నుంచి లేఖ వచ్చింది. కానీ దానికంటే ముందే వేతనాలపై ఫిలిం ఛాంబర్ ఆలోచిస్తోంది. ఇంతలోనే ఫిలిం ఫెడరేషన్ ఇలా సమ్మె చేయాలని నిర్ణయించుకోవడం చాలా తప్పు. షూటింగ్‌లు ఆపేదే లేదు. రేపటి నుంచి యథావిధిగా కార్మికులు షూటింగ్స్‌కు హాజరుకావాలి. వేతనాలపై విధి విధానాలు రూపకల్పన చేస్తాం. మీకు ఐదు కండీషన్స్ పెడుతున్నాం. 1. నిర్మాతలపై ఒత్తిడి చేసే ఆలోచన ఉంటే విరమించుకోవాలి. 2. సినీ కార్మికుల ఒత్తిడికి తలొగ్గి ఎవరూ వేతనాలు పెంచొద్దు. 3. అందరం కలిసి షూటింగ్స్ జరుపుకుందాం. 4. ఎల్లుండి వేతనాలపై చర్చిస్తాం. 5. ఏ కార్మికుడి కడుపు కొట్టాలని నిర్మాత చూడడు. కార్మికులందరికి వేతనాలు పెంచడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. ఒకవేళ సినిమా కార్మికులు హాజరుకాకపోతే తామే షూటింగ్ లు ఆపేస్తాం. 2018లో వేతనాలపై ఒప్పందం చేసుకున్నాం. ఫిలిం ఫెడరేషన్ నాయకులు కార్మికుల కడుపు కొట్టొద్దు' అని పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment