
ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి నటించిన చిత్రం ‘టర్బో’. ఇదో సీరియస్ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్. దీనికి దర్శకులు వైశాఖ్. డెబ్బై ఏళ్ళ పైబడి వయస్సులో ఉన్న మమ్ముట్టి ఈ సినిమాలో నలభై ఏళ్ల వ్యక్తిలా యంగ్ అండ్ ఎనర్జిటిక్‌గా కనిపించారు. టర్బో జోస్ (మమ్ముట్టి) తనకు సంబంధం లేని తగాదాల్లో తల దూరుస్తుంటాడు. అతనిది ఎవ్వరికీ భయపడని మనస్తత్వం... ఒక్క వాళ్లమ్మకు తప్ప. జోస్‌కి మంచి ఆప్తుడు జెర్రీ.
జెర్రీకి సంబంధించిన ఓ సమస్యను పరిష్కరించడంలో జెర్రీని ప్రేమించిన నిరంజనకు జోస్ తారసపడి, అదే సందర్భంలో తన ఆప్తుడైన జెర్రీని పోగొట్టుకుంటాడు. అలాగే జెర్రీ సమస్య నగరంలో అసమాన్యుడి నుండి సామాన్యుడి వరకు ప్రతి ఒక్కరూ భయపడే వెట్రివేల్ షణ్ముగంతో ముడిపడి ఉంటుంది. దీంతో వెట్రివేల్‌తో టర్బో జోస్ పోరాడవలసి వస్తుంది. అసలు జెర్రీకి వచ్చిన సీరియస్ సమస్య ఏంటి ? జెర్రీ ఎలా చనిపోయాడు? వెట్రివేల్‌ను జోస్ ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది మాత్రం సోనీ లివ్ ఓటీటీæ తెరమీదే చూడాలి.
టర్బో అంటే అదనపు శక్తి అన్నమాట. టైటిల్‌కి తగ్గట్టే సినిమాలో ఎలిమెంట్స్ అన్నీ అదనపు శక్తితో నడుస్తాయి. మమ్ముట్టి మంచి ఈజ్‌తో జోస్ పాత్రను రక్తి కట్టించారు. ఆ తరువాత చెప్పుకోవలసిన పాత్ర రాజ్ బి. శెట్టిది. ఇతనే వెట్రివేల్ షణ్ముగం. ఈ సినిమాలో ప్రతినాయకుడు. విలన్ పాత్రలో రాజ్ బి. శెట్టి చాలా విలక్షణంగా చేశారు. ఈ పాత్రలతో పాటు సినిమా మొత్తం యాక్షన్, కామెడీ సన్నివేశాలతో సీరియస్ కథను సరదా స్క్రీన్‌ప్లేతో తెరకెక్కించిన విధానం అద్భుతం. వీకెండ్‌కి ఓ మంచి సినిమా ఈ ‘టర్బో’.
– ఇంటూరి హరికృష్ణ