
అలనాటి అందాల తార సీమా డియో(81) అస్తమించారు. వృద్ధాప్య సమస్యలతో సతమతమవుతున్న సీమా గురువారం నాడు ముంబైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె తనయుడు అభినయ్ డియో మీడియాకు వెల్లడించారు. 'గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో అమ్మ మరణించింది. అల్జీమర్స్ వ్యాధి వల్ల తను అన్నీ మర్చిపోతూ వచ్చింది. రోజువారీ చేసే పనులకు సైతం ఇబ్బంది పడింది. ప్రతి చిన్న విషయాన్ని మర్చిపోయింది.
జ్ఞాపకశక్తి తగ్గిపోవడంతో..
తనకు డిమెన్షియా ఉండేది. అది కాస్తా అల్జీమర్స్‌కు దారి తీసింది. మూడేళ్లుగా ఆమె దీనితో పోరాడింది. దీనివల్ల ఆమె నడవడం అనేది కూడా మర్చిపోయింది. జ్ఞాపకశక్తి తగ్గిపోవడంతో పాటు అవయవాలు కూడా నెమ్మదిగా ఒక్కొక్కటి పనిచేయడం ఆగిపోతూ వచ్చాయి' అని ఆయన పేర్కొన్నారు. కాగా సీమా డియో అంతిమక్రియలు శివాజీ పార్క్‌లో నేడు సాయంత్రం జరగనున్నాయి.
80కు పైగా సినిమాలు
కాగా సీమా డియో హిందీ, మరాఠీ భాషల్లో కలిసి 80కు పైగా చిత్రాల్లో నటించారు. ఆనంద్, కొర కాగజ్ వంటి ఎన్నో చిత్రాలతో ఆమె హిందీ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. సీమా 1963లో నటుడు రమేశ్ డియోను పెళ్లాడింది. వీరికి ఆజింక్య డియో, అభినయ్ డియో అని ఇద్దరు సంతానం. గతేడాది రమేశ్ కన్నుమూశారు.
Comments
Please login to add a commentAdd a comment