![Vijay Antony Daughter Meera Last Rites Completed On wednesday - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2023/09/21/meera.jpeg.webp?itok=vjr1RYvS)
విజయ్ ఆంటోనీ కూతురు మీరాకు అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు ముగిశాయి. చెన్నైలోని ఓమందూర్ ఆసుపత్రి నుంచి మీరా మృతదేహాన్ని బుధవారం ఉదయం స్థానిక నుంగమ్‌బాక్కమ్‌లోని చర్చికి తరలించారు. అక్కడ ప్రార్థనల అనంతరం పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మీరా పార్థీవ దేహానికి నివాళులర్పించారు.
రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్, నటుడు కార్తీ, సత్తిరాజ్, శింబు, భరత్, సిబి రాజ్, దర్శకులు భారతీ రాజా, శశి, మిష్కిన్, సుశీంద్రన్, ఎడిటర్ మోహన్, మోసన్రాజా, ఎస్‌ఆర్ ప్రభు, సతీష్, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్, యువన్ శంకర్ రాజా, ప్రభుదేవా, నటి సుధ పలువురు మీరాకు నివాళులర్పించారు. మీరా చదువుకున్న పాఠశాల నిర్వాహకులు, సహ విద్యార్థులు, పిల్లల తల్లిదండ్రులు ఆమె భౌతికాయాన్ని చూడటానికి పెద్దఎత్తున తరలివచ్చారు. మీరా భౌతికకాయాన్ని చూసిన పలువురు విద్యార్థులు కంటతడి పెట్టుకున్నారు.
ఆ తర్వాత ఉదయం 11 గంటల ప్రాంతంలో మీరా భౌతికాయానికి స్థానిక కీల్పాక్కంలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. అంతిక్రియల సమయంలో మీరా తల్లి ఫాతిమా విజయ్ ఆంటోని కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ ఘటన అక్కడ ఉన్న వారందరినీ కంటతడి పెట్టించింది.
మీరా సూసైడ్
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. చెన్నైలో ఓ ప్రైవేట్ స్కూల్లో 12వ తరగతి చదువుతున్న మీరా ఆంటోనీ(16) బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటనతో కోలీవుడ్ ఇండస్ట్రీ మాత్రమే కాదు.. సౌత్ సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఈ విషయం తెలుసుకున్న కోలీవుడ్ సినీ ప్రముఖులు సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment