రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక
ములుగు రూరల్: తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు అండర్ –17 విభాగంలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల ప్రిన్సిపాల్ అంకయ్య తెలిపారు. ఈ మేరకు బుధవారం గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు దేవరాజ్, జశ్వంత్‌లను ఉపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 7నుంచి 9వ తేదీ వరకు యాదాద్రి జిల్లాలో జరిగే రాష్టస్థాయి పోటీలలో దేవరాజ్, జశ్వంత్‌లు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసుదేవ్, ఎండి రహీంపాషా, శ్రీనివాస్, క్రాంతి కుమార్, శోభన్‌బాబు, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
బాలలను పనిలో
పెట్టుకోవడం నేరం
ములుగు రూరల్: బాలలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్ అన్నారు. ఈ మేరకు బుధవారం మండలంలోని జాకారం పరిధిలో గల రాజరాజేశ్వర కాటన్ మిల్లులో బాల కార్మికుల నిర్మూలన చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల కార్మికులను ప్రమాదకరమైన పనుల్లో పెట్టుకోకూడదని తెలిపారు. బడీడు పిల్లలను బడిలో చేర్పించాలన్నారు. వలస కార్మికులు కార్మిక చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్మికులకు ఉచిత న్యాయంపై వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ స్వామి దాస్, రాచర్ల రాజ్‌కుమార్, కార్మికులు పాల్గొన్నారు.
మాదిగలకు 12శాతం రిజర్వేషన్ అమలు చేయాలి
గోవిందరావుపేట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాదిగలకు 12శాతం రిజర్వేషన్ అమలు చేయాలని మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు అంబాల మురళి అన్నారు. మండల పరిధిలోని పస్రాలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ తీర్పును మాదిగలు స్వాగతిస్తున్నారని తెలిపారు. డాక్టర్ పిడమర్తి రవి ఆధ్వర్యంలో మాదిగలు ఐక్య ఉద్యమాలకు సిద్ధమై హక్కులను సాధించుకోవాలన్నారు. నిరుపేదలకు ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పసుల రవి, సృజన్, బన్నీ, సన్ని, స్వామి, సుజాత, మమత, రాకేశ్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.
మోటార్లకు కెపాసిటర్లు
అమర్చుకోవాలి
మంగపేట: రైతులు వ్యవసాయ మోటార్లకు కెపాసిటర్లను అమర్చుకోవాలని ట్రాన్స్‌కో డివిజనల్ ఇంజనీర్ పుల్సం నాగేశ్వర్‌రావు అన్నారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని రాజుపేటలో పొలంబాట కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాన్స్‌కో అధికారులు మాట్లాడుతూ 5 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన విద్యుత్ మోటారుకు 2 కేవీఆర్ కెపాసిటర్లను బిగించుకోవాలన్నారు. కెపాసిటర్లను అమర్చుకోవడం వల్ల లోఓల్టేజీ సమస్య ఉండకుండా ఆయా ట్రాన్స్‌ఫార్టర్ల పరిధిలోని రైతులందరికీ సక్రమంగా విద్యుత్ సరఫరా జరుగుతుందని తెలిపారు. కెపాసిటర్ల వినియోగంతో కలిగే ఉపయోగాలు, ఆటో స్టార్టర్లతో కలిగే నష్టాలతో పాటు విద్యుత్ ప్రమాదాలపై అవగాహన కల్పించారు. రైతులు తప్పక కెపాసిటర్లను వినియోగించి విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలుగకుండా ట్రాన్స్‌కో సిబ్బందికి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్‌కో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ కృష్ణారావు, ఏఈ వెంకటేశ్, సబ్ ఇంజనీర్ సత్యనారాయణ, సిబ్బంది, స్థానిక రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment