ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి
ములుగు: జిల్లాలోని మారుమూల ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు సూచించారు. జిల్లా కేంద్రంలోని వైద్యారోగ్యశాఖ సమావేశ మందిరంలో బుధవారం పీహెచ్‌సీ, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, ఆర్బీఎస్కే ప్రోగ్రాం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అసంక్రమిత వ్యాధుల నివారణ కార్యక్రమంలో భాగంగా మూడో దశలో చేపట్టిన ఆయుష్మాన్ భారత్ కార్డుల నమోదును 100శాతం చేయాలని సూచించారు. స్క్రీనింగ్ ప్రక్రియను వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు పూర్తి చేయాలన్నారు. మాతాశిశుసంక్షేమ ఆరోగ్యం, పోషకాహార కార్యక్రమంలో భాగంగా గర్భిణుల వివరాలను 12వారాలలోపు నమోదు చేసి అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించాలన్నారు. గర్భిణుల భయాందోళనను తొలగించి ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ అయ్యేలా చూడాలన్నారు. క్షయవ్యాధి నివారణలో భాగంగా టీబీ నిర్ధారణకు తెమడ పరీక్షలు చేయించాలన్నారు. పాజిటీవ్‌గా తేలితే టీబీ కేసుగా గుర్తించి పోర్టల్‌లో వివరాలను నమోదు చేయాలన్నారు. ఇతరులకు సంక్రమించకుండా మందులు అందించాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ విపిన్‌కుమార్, జిల్లా ప్రోగ్రాం అధికారులు పవన్‌కుమార్, రణధీర్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
జాకారం వెల్‌నెస్ సెంటర్ తనిఖీ
ములుగు రూరల్: మండల పరిధిలోని జాకారం వెల్‌నెస్ సెంటర్‌ను డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్ సెంటర్ పరిధిలో ఉన్న గర్భిణులు, చిన్నారుల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు బీపీ, షుగర్ బాధితుల సంఖ్యను తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంఎల్‌హెచ్‌పీ జితేందర్, హెల్త్ అసిస్టెంట్ వెంకన్న, ఏఎన్‌ఎం తిరుమల పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు
Comments
Please login to add a commentAdd a comment