సర్వేకు ప్రజలు సహకరించాలి
ములుగు: సమగ్ర కుటుంబ సర్వేకు ఇళ్లకు వచ్చే ఎన్యుమరేటర్లకు ప్రజలు సహకరించాలని కలెక్టర్ దివాకర కోరారు. ఈ సందర్భంగా బుధవారం కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు మొదటి దశలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా ఇళ్లను సందర్శించనున్నట్లు వెల్లడించారు. అదే విధంగా ఇళ్ల జాబితాను రూపొందించడం జరుగుతుందని, రెండో దశ సర్వే చేసి ప్రతీ కుటుంబం సమగ్ర సమాచారాన్ని సేకరిస్తారని వివరించారు. జిల్లాలోని 9 మండలాల్లో 88,071 ఇళ్ల సర్వే నిర్వహణనకు 902 ఎన్యుమరేషన్ బ్లాక్‌లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఎన్యుమరేటర్లుగా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, వీఓఏలను నియమించినట్లు తెలిపారు. గణనకు 150 ఇళ్లు ఒక ఎన్యుమరేటర్‌కు బ్లాక్‌గా కేటాయించినట్లు తెలిపారు. సర్వేపై శిక్షణ అనంతరం ఎన్యుమరేటర్లకు అవసరమైన స్టేషనరీతో కూడిన కిట్ అందించినట్లు వివరించారు. సర్వే చేసే ప్రాంతాల్లో ఒక రోజు ముందుగానే విస్తృత సమాచారం ఇచ్చి ప్రజలకు అవసరమైన అన్ని పత్రాలు అందుబాటులో ఉంచుకునేలా అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు. అలాగే సర్వే ఫారంలో ఎన్యుమరేటర్లు ఎట్టి పరిస్థితుల్లో తప్పులు నింపవద్దని, ఏవైనా సందేహాలు ఉంటే సూపర్‌వైజర్లు, ఎంపీడీవోలను సంప్రదించి సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఇళ్ల జాబితా తయారీ సందర్భంగా ఇంటిని సందర్శించినట్లుగా స్టిక్కర్ అతికించాలని సూచించారు. సర్వే ఫారంలో పూర్తి వివరాలను నింపాలని, ప్రతీ ఇంటికి వెళ్లి సేకరించిన డేటాను ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నట్లు వెల్లడించారు. సమగ్ర సర్వేకు వివరాలు ఇచ్చేందుకు ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రతిరోజూ టెలి కాన్ఫరెన్స్, ఆకస్మిక తనిఖీలతో కార్యక్రమాన్ని పర్యవేక్షించనున్నట్లు తెలిపారు.
అభివృద్ధి పనులను గ్రౌండింగ్ చేయాలి
మంజూరైన అభివృద్ధి పనులను వెంటనే గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్ దివాకర సూచించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ఐటీడీఏ ఇంజనీరింగ్ అధికారులతో బుధవారం కలెక్టర్ సమీక్ష నిర్వహించి మాట్లాడారు. పనుల్లో నాణ్యత ఉంటనే బిల్లులు చెల్లిస్తామన్నారు. బీటీరోడ్లు, విద్య, మౌలిక సదుపాయాలు, ఎన్‌హెచ్‌ఎం సబ్‌సెంటర్లు , గ్రామ పంచాయతీ భవనాలు, డీఎంఎఫ్‌టీ గ్రాంట్ల పనుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు ఎన్ని పనులకు గ్రౌండింగ్ చేశారు, పెండింగ్ పనుల వివరాలపై ఆరా తీశారు. గ్రౌండింగ్ కాని పనులకు టెండర్ ప్రక్రియ పూర్తి చేసి ఈ నెల 30వ తేదీ లోపు పనులు ప్రారంభించాలని సూచించారు.
కలెక్టర్ టీఎస్.దివాకర
Comments
Please login to add a commentAdd a comment