మద్దతు ధరకు పత్తి కొనాలని రోడ్డెక్కిన రైతులు
తెలకపల్లి: ఆరుగాలం కష్టించి పండించిన పత్తిని మద్దతు ధరకు కొనుగోలు చేయాలంటూ రైతులు రోడ్డెక్కారు. మహబూబ్‌నగర్ – శ్రీశైలం ప్రధాన రహదారిపై పత్తి వాహనాలను అడ్డుగా పెట్టి ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. తెలకపల్లి మండలం చిన్నముద్దునూరు సమీపంలోని వినాయక కాటన్ మిల్లులో ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు కేంద్రానికి గురువారం వివిధ ప్రాంతాల నుంచి రైతులు పత్తిని తీసుకువచ్చారు. అయితే పత్తిలో తేమశాతం ఎక్కువగా ఉందని పేర్కొంటూ కొనుగోలు చేయలేదు. రైతులు ఉదయం నుంచి అక్కడే పడిగాపులు కాసినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో రైతులు పత్తి ట్రాక్టర్లతో ప్రధాన రహదారిపైకి చేరుకొని ఆందోళనకు దిగారు. తేమ పేరుతో పత్తిని మద్దతు ధరకు కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఓవైపు ప్రభుత్వం రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేయాలని చెబుతుండగా.. మరోవైపు సీసీఐ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. ప్రధాన రహదారిపై రైతుల ఆందోళనతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ నరేష్ అక్కడికి చేరుకొని సీసీఐ అధికారులతో మాట్లాడినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది. ఇక రైతులు చేసేదేమీ లేక ఇంటిముఖం పట్టారు. మరికొందరు ఇతర మిల్లులకు పత్తిని తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment