సమగ్ర కుటుంబ సర్వే 96 శాతం పూర్తి
నాగర్‌కర్నూల్: జిల్లాలో చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులగణన సర్వే 96శాతం పూర్తయిందని కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వేపై ఆదివారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. జిల్లాలో చేపట్టిన సర్వే వివరాలను కలెక్టర్ వివరించారు. జిల్లావ్యాప్తంగా 2,50,596 నివాసాలను గుర్తించగా.. శనివారం వరకు 2,39,321 నివాసాలలో సర్వే పూర్తి చేసినట్లు వెల్లడించారు. రానున్న రెండు రోజుల్లో 100 శాతం సర్వేను పూర్తి చేస్తామన్నారు. ఇంటికి తాళంవేసి ఇతర ప్రాంతాలకు వెళ్లిన కుటుంబాలకు సమాచారం అందించి, సర్వే ప్రక్రియను పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపారు. సర్వే పూర్తయిన కుటుంబాలకు సంబంధించిన వివరాల కంప్యూటరికీకరణ సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు వివరించారు. ఈ విషయంపై శనివారం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి, స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. డేటా ఎంట్రీలో తప్పులకు తావివ్వకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సర్వే పత్రాల భద్రత విషయంలో తగు జాగ్రత్తలు పాటిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా జిల్లావ్యాప్తంగా ఉన్న గురుకులాలు, వసతి గృహాలకు ప్రత్యేకాధికారులను నియమించామని.. వారి పర్యవేక్షణలో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించడంతో పాటు అవసరమైన సదుపాయాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతి వారంలో రెండుసార్లు పాఠశాలలు, గురుకులాలు, హాస్టళ్లను తనతో పాటు అదనపు కలెక్టర్లు కూడా సందర్శిస్తున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు తెలియజేశారు. వీసీలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దేవ సహాయం తదితరులు ఉన్నారు.
పకడ్బందీగా
డేటా ఎంట్రీ నిర్వహిస్తాం
కలెక్టర్
బదావత్ సంతోష్
Comments
Please login to add a commentAdd a comment