ప్రతి పౌరుడికిప్రాథమిక హక్కులు
నారాయణపేట: భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కులు కల్పించిందని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ ఉమర్ అన్నారు. జాతీయ న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సంవిధాన్ దివస్ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం న్యాయవాదుల స్వర్గమని, జీవితానికి, వ్యక్తిగత స్వేచ్ఛకు అంతర్ లీనమైందన్నారు. కార్యక్రమంలో చీఫ్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ లక్ష్మీపతిగౌడ్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ నాగేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా కార్తీక వనమహోత్సవం
నారాయణపేట రూరల్: కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో వన మహోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. డిపో మేనేజర్ లావణ్య ఆధ్వర్యంలో డ్రైవర్లు, కండక్టర్లతో పాటు వివిధ విభాగాల ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు. ఈ సందర్భంగా చిన్నారులు నిర్వహించిన నృత్యాలు అందరినీ అలరించాయి. ఆర్టీసీ ఉద్యోగులకు ఆటల పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. అనంతరం సామూహికంగా వనభోజనాలు చేశారు. అక్టోబర్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన డ్రైవర్లు, కండక్టర్లకు ప్రగతి చక్రం అవార్డులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్లు, డిపో వెల్ఫేర్ బోర్డు మెంబర్స్ పాల్గొన్నారు.
మార్కెట్ కమిటీచైర్‌పర్సన్‌గా రాధమ్మ
మక్తల్: స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గాన్ని ప్రభుత్వం నియమించింది. మండలంలోని సంగంబండకు చెందిన గవినోళ్ల రాధమ్మను చైర్‌పర్సన్‌గా, మక్తల్‌కు చెందిన గణేష్‌కుమార్‌ను వైస్‌చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి చొరవతో మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్, వైస్‌చైర్మన్‌తో పాటు 12 మంది పాలక మండలి సభ్యులను ఎంపిక చేశారు.
విద్యార్థులు
క్రీడల్లోనూ రాణించాలి
నారాయణపేట: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని జెడ్పీ సీఈఓ జ్యోతి అన్నారు. జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని క్రీడా మైదానంలో మాధ్యమిక ఉన్నత కళాశాల స్థాయి క్రీడా పోటీలను నిర్వహించారు. జెడ్పీ సీఈఓతో పాటు బీసీ సంక్షేమశాఖ అధికారి అబ్దుల్ ఖలీల్, డీపీఆర్‌ఓ ఎంఏ రషీద్, డీవైఎస్‌ఓ వెంకటేష్, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ అధికారి ఉమాపతి జ్యోతిప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. కబడ్డీ, వాలీబాల్, ఖోఖో క్రీడలతో పాటు అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించగా.. పాఠశాల, కళాశాల స్థాయి వసతిగృహాలకు చెందిన 300 మంది బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు, వసతిగృహాల వార్డెన్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment