విద్యార్థులను పరామర్శించడం తప్పా..
● మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డిఅసహనం
● చిట్టెంను పోలీసుల ముందస్తు అరెస్టు.. మద్దూరు పీఎస్‌కు తరలింపు
మద్దూరు: నా నియోజకవర్గ పరిధిలోని పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురికిగా.. ఓ మాజీ ఎమ్మెల్యేగా అక్కడికి వెళ్లి విద్యార్థులను, వారి తల్లిదండ్రులను పరామర్శించడం తప్పా అని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి ప్రశ్నించారు. బుధవారం మక్తల్ పోలీసులు ఆయనను ముందస్తు అరెస్ట్ చేసి మద్దూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇదే పాఠశాలలో వారం రోజుల్లో మూడు సార్లు పుడ్ పాయిజన్ జరుగడంపై మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ మండల నాయకులు పాఠశాలను సందర్శించి, విద్యార్థులతో, వారి తల్లీదండ్రులతో మాట్లాడడం జరుగుతుందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగడంతో పోలీసులు మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేసి ఇక్కడి తరలించినట్లు సమాచారం. పాఠశాలలో మొదటిసారి విద్యార్థులు అస్వస్థతకు గురైనప్పుడు కలెక్టర్‌కు, సంబంధిత అధికారులకు పలు సూచన లు చేసినా పట్టించుకోలేదని, మళ్లీ పునరావృతం కావడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. విద్యార్థుల ఆరోగ్యం విషయంలో రాజకీయాలు చేయాలనుకోలేదని, అధికారుల అలసత్వం వల్లే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయని తెలిపారు. ఎస్సీ యోగేష్‌గౌతమ్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. అనంతరం సొంత పూచికత్తుపై విడిచిపెట్టినట్లు సమాచారం.
ఆహార భద్రతపై దృష్టి సారించాలి
నారాయణపేట: పాఠశాలల మధ్యాహ్న భోజన పథకం అమలులో గురుకులాలు, హాస్టళ్లలో విద్యార్థుల ఆహార భద్రతపై అధికారులు దృష్టి సారించాలని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) జిల్లా అధ్యక్షుడు గౌని నాగేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. సర్కారు ఆధీనంలో నడిచే హాస్టళ్లు, గురుకులాల్లో ఆహార భద్రతను పట్టించుకోకపోవడం వల్ల కలుషిత ఆహారం అందజేస్తున్నారని, దీంతో విద్యార్థులు ఆస్పత్రి పాలవుతున్నారని అన్నారు. మాగనూరు ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేయాలని, అపరిశుభ్ర వాతావరణంలో నాసిరకం పదార్థాలు, పాడైన కూరగాయలతో వంటలు చేయడం వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. గురుకులాల్లో, పాఠశాలల్లో వార్డెన్లు, ప్రిన్సిపాళ్లు రుచి చూసిన తరువాతే విద్యార్థులకు వడ్డించాలని, కానీ ఇలాంటి తనిఖీలు ఎక్కడా జరగడం లేదన్నారు. విద్యార్థులకు నాణ్యత, శుభ్రత లేని ఆహార పదార్థాలను అందిస్తున్న యాజమాన్యాలపై ఆహార భద్రత (ఫుడ్ సేఫ్టీ) అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయనతో పాటు హేమ సుందర్, మల్లెపల్లి సువర్ణ, మమ్మద్ మైనుద్దీన్, సంయుక్త కార్యదర్శి మసి పవన్, ప్రచార కార్యదర్శి కుర్వ మనోజ్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment