పక్కాగా మెనూ అమలు చేయండి
నారాయణపేట: విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారాన్ని అందించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలికల(ఆనంద నిలయం), ఎస్సీ బాలుర వసతి గృహాన్ని కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. విద్యార్థినులకు వడ్డిస్తున్న అల్పాహారాన్ని, వంట గదిలో నిల్వ ఉంచిన కూరగాయలను పరిశీలించారు. విద్యార్థినులకు సరిపడా దుప్పట్లు ఉన్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. మెనూ బోర్డు చూసి గురువారం నాటి అల్పాహారం కిచిడి ఉండగా విద్యార్థినులకు జీరా రైస్ వడ్డించిన విషయాన్ని గుర్తించిన కలెక్టర్ అక్కడి సిబ్బందిని ప్రశ్నించారు. మెనూ ప్రకారం కాకుండా వేరే అల్పాహారం ఎలా ఇస్తారని, ఇకపై క్రమం తప్పకుండా మెనూ ప్రకారం నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందించాలని సూచించారు. తినడానికి ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని విద్యార్థినులకు చెప్పారు. వంట చేసే సిబ్బంది కూడా పరిశుభ్రత పాటించాలని, వంట గది, కూరగాయలు, స్టోర్ గది శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఇక బాలుర వసతి గృహంలోని వంటగదికి వెళ్లి సరకుల నాణ్యత ను చూశారు. వంట చేసే సిబ్బంది చేతి తొడుగులు, హెడ్ క్యాప్‌లను ధరించి, శుభ్రమైన చేతులతో వంట చేయాలన్నారు. కాగా ఒకరిద్దరు విద్యార్థులు వసతి గృహంలో నీరు నాలుగు రోజులుగా రావడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకు వచ్చారు. మున్సిపాలిటీ అధికారులతో మాట్లాడి నీరు సరఫరా చేయించాలని అక్కడి వార్డెన్‌ను ఆమె ఆదేశించారు. అలాగే ప్యూరిఫైడ్ వాటర్ నమూనాలను తీసుకుని పరీక్ష చేయించాలని సూచించారు.
విద్యార్థులకు నాణ్యమైన ఆహారంఅందించాలి
వసతి గృహాల తనిఖీలో కలెక్టర్ సిక్తా పట్నాయక్
Comments
Please login to add a commentAdd a comment