
వృద్ధాప్య సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిక
న్యూఢిల్లీ: బీజేపీ కురు వృద్ధుడు, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ బుధవారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్య నిపుణులు సమీక్షిస్తున్నారు. 96 ఏళ్ల అద్వానీ వృద్ధాప్య సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. బీజేపీని దేశవ్యాప్తంగా విస్తరించడంలో దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయితో పాటు అద్వానీది కీలక పాత్ర.
దాదాపు నాలుగు దశాబ్దాల ఆయన రాజకీయ జీవితంలో రథయాత్ర కీలక మలుపు. ఆ యాత్ర ద్వారా బీజేపీకి దేశవ్యాప్తంగా ఊపు తీసుకొచ్చారు. 1999–2004 మధ్య ఉప ప్రధానిగా, కేంద్ర మంత్రిగా చేశారు. బీజేపీ అధ్యక్షునిగా కూడా పని చేశారు. పదేళ్లుగా అద్వానీ పూర్తి విశ్రాంత జీవితం గడుపుతున్నారు. ఈ ఏడాదే ఆయన భారతరత్న అందుకున్నారు.
వయో భారం దృష్ట్యా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయన నివాసానికి వెళ్లి ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో పురస్కారాన్ని అందజేయడం తెలిసిందే.