న్యూఢిల్లీ: రాజ్యసభ నుంచి తనను సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సభా హక్కుల ఉల్లంఘన కింద రాఘవ్ చద్దాపై నలుగురు ఎంపీలు ఫిర్యాదు చేయడంతో ఆగస్టు 11న ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. సభా హక్కుల కమిటీ దర్యాప్తు చేసి, నివేదిక ఇచ్చేంత వరకూ ఆయనపై సస్పెన్షన్ వేటు కొనసాగుతుందని రాజ్యసభ స్పష్టం చేసింది. దీనిని రాఘవ్ చద్దా సుప్రీంకోర్టులో తాజాగా సవాలు చేశారు.
తన సస్పెన్షన్ రాజ్యసభలోని విధివిధానాలు, ప్రవర్తనా నియమాలతో పాటు రాజ్యాంగంలోని 14, 21 ఆర్టికల్‌ను స్పష్టంగా ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన సివిల్ రిట్ పిటిషన్‌లో రాజ్యసభ సెక్రటేరియట్, రాజ్యసభ చైర్మన్‌ను ప్రతివాదులుగా చేర్చారు. తన సస్పెన్షన్ కారణంగా ఆర్థిక స్టాండింగ్ కమిటీ, సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ సమావేశాలకు తాను హాజరు కాలేకపోతున్నట్లు చెప్పారు.
కాగా నిబంధనల ఉల్లంఘన, అనుచిత ప్రవర్తన, ధిక్కార వైఖరి ఆరోపణలపై పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఆగస్టు 11న పరాఘవ్ చద్దా రాజ్యసభ నుంచి సస్పెన్షన్‌కు గురైన విషయం తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీ(సవరణ) బిల్లు–2023పై ప్రతిపాదిత సెలెక్ట్ కమిటీకి అనుమతి తీసుకోకుండానే తమ పేర్లను చేర్చారంటూ డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌కు నలుగురు ఎంపీలు ఫఙర్యాదు చేశారు. తమ సంతకాలను ఫోర్జరీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
రాఘవ్ చద్ద సస్పెన్షన్‌పై శుక్రవారం రాజ్యసభ నేత పీయూష్ గోయెల్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. దీంతో రాఘవ్ చద్దాను సస్పెండ్ చేశారు. దీనిపై సభా హక్కుల కమిటీ విచారణ జరిపి, నివేదిక ఇచ్చే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment