ముంబై: చేసిన సాయం చెప్పుకోవడం తనకు ఇష్టం ఉండదని ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్(78) స్పష్టం చేశారు. దేశమంతటా కరోనా మహమ్మారి కారణంగా ఎంతోమంది బాధితులు ప్రాణాలు విడుస్తున్నా సినీ రంగం పెద్దలు, సెలబ్రిటీలు నిద్ర నటిస్తున్నారని, సాయం చేయడానికి వారికి మనసొప్పడం లేదంటూ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న విమర్శలపై ఆయన సోమవారం స్పందించారు. కరోనా విపత్తు సమయంలో తాను చేపట్టిన కొన్ని దాతృత్వ కార్యక్రమాలను బయటపెట్టారు.
రైతు ఆత్మహత్యలను నివారించా..
కరోనా సంక్షోభం మొదలైనప్పటి నుంచి సాధ్యమైనంత ఎక్కువ మందికి సాయం అందిస్తున్నానని బిగ్‌బీ పేర్కొన్నారు. చేసిన మేలు చెప్పుకోవడం ఎవరికైనా ఇబ్బందికరంగానే ఉంటుందన్నారు. చెప్పడం కంటే చేయడాన్నే తాను నమ్ముతానని తెలిపారు. తన వ్యక్తిగత నిధి నుంచి కరోనా ఫ్రంట్‌లైన్ యోధులకు మాస్కులు, పీపీఈ కిట్లు అందించానని చెప్పారు. విదేశాల నుంచి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు తెప్పించి, ఢిల్లీ, ముంబైలో ఆసుపత్రులకు అందించానని తెలిపారు.
ఢిల్లీ గురుద్వారాలో 250 నుంచి 450 పడకల కేర్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. తన తాత, నాన్నమ్మ, తల్లి పేరిట ఖరీదైన ఎంఆర్‌ఐ యంత్రం, సోనోగ్రాఫిక్, స్కానింగ్ పరికరాలు అందజేశానన్నారు. 1,500 మందికి పైగా పేద రైతులకు ఆర్థిక సాయం చేశానని ఉద్ఘాటించారు. వారి బ్యాంకు రుణాలను తానే తీర్చేశానని వివరించారు. తద్వారా వారి ఆత్మహత్యలను ఆపగలిగానని అమితాబ్ సంతృప్తి వ్యక్తం చేశారు. 2019 ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రవాద దాడిలో మరణించిన 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్ల కుటుంబాలను ఆదుకున్నానని చెప్పారు. గత ఏడాది లాక్‌డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా 4 లక్షల మంది దినసరి కూలీలకు నెల రోజులపాటు ఆహారం అందజేశానన్నారు. వలస కార్మికులు వారి సొంతూళ్లకు తిరిగి వెళ్లేందుకు సహకారం అందించానని వెల్లడించారు.
కోవిడ్ కేర్ సెంటర్‌కు అమితాబ్ రూ. 2 కోట్ల విరాళం
బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ తన ఉదారతను చాటుకున్నారు. కోవిడ్‌పై పోరుకు ఆయన రూ. 2 కోట్లు విరాళంగా అందజేశారు. ఢిల్లీలోని శ్రీ గురు తేగ్ బహదూర్ కోవిడ్ కేర్‌సెంటర్‌కు ఆయన ఈ డబ్బును అందించినట్లు ఢిల్లీ సిఖ్ గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ అధ్యక్షుడు మణ్‌జిందర్ సింగ్ శీర్షా సోమవారం తెలిపారు. కోవిడ్‌తో పోరాడే వారికి సిక్కులు ఎనలేని సేవలు అందిస్తున్నారని, అందుకే వారికి ఈ సాయం అందిస్తున్నట్లు అమితాబ్ పేర్కొన్నారని ఆయన వెల్లడించారు. 300 పడకల ఈ కోవిడ్ కేర్ సెంటర్ సోమవారం మధ్యాహ్నం నుంచి రోగులకు సేవలు ప్రారంభించింది. విదేశాల నుంచి ఆక్సిజన్ సిలిండర్లు తెప్పించి మరీ సాయం అందించారని కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment