
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ఆప్ ఎమ్మెలే దుర్గేశ్ పాఠక్‌తో పాటు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పీఏ విభవ్ కుమార్‌ను సోమవారం ఈడీ ప్రశ్నించింది. సౌత్ గ్రూప్ నుంచి హవాలా రూపంలో తీసుకున్న రూ.45 కోట్లను గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఆప్ వాడిందని ఈడీ ఆరోపిస్తుండటం తెలిసిందే. ఆ ఎన్నికల్లో గోవాకు పాఠక్ ఇన్‌చార్జిగా ఉన్నారు. ఎన్నికల వేళ జరిగిన నగదు లావాదేవీలపై ఆయన్ను ఈడీ ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ కేసులో కీలక పత్రాలకు సంబంధించిన వివరాల కోసం విభన్‌ను విచారించింది.
ప్రచారం నుంచి దూరం చేసేందుకే: ఆతిశి
పాఠక్‌ను విచారించడంపై ఢిల్లీ మంత్రి అతిశి మండిపడ్డారు. ఆప్ నేతలను ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చేసేందుకే విచారణ పేరుతో బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు.