ఆగస్టు 15న దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. అయితే మనదేశంలోని ఆ రాష్ట్రంలో రెండుసార్లు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతాయి. దీనివెనుక చారిత్రక కారణం ఉంది.
గోవాలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఏడాదికి రెండుసార్లు జరుపుకుంటారు. వినడానికి ఇది కొంచెం వింతగా అనిపిస్తుంది. భారతదేశం 1947, ఆగష్టు 15న బ్రిటిష్ సామ్రాజ్యం నుండి స్వాతంత్య్రం పొందింది. బ్రిటీష్ వారు భారతదేశానికి రాకముందే పోర్చుగీస్‌వారు గోవాలో స్థిరపడ్డారు. భారతదేశంలో బ్రిటిష్ పాలన ముగిసినప్పటికీ, పోర్చుగీస్‌వారు 14 ఏళ్ల తర్వాత గోవాకు స్వాతంత్య్రాన్ని అందించారు. పోర్చుగీసువారు 1510 నుండి గోవాలో తిష్టవేశారు. అక్కడ నివసిస్తున్న హిందువులను నానా హింసలకు గురిచేశారు. పోర్చుగీస్ ప్రభుత్వం ఎవరైనా హిందువులు స్వచ్ఛందంగా క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే, వారికి 15 ఏళ్లపాటు పాటు భూమి పన్ను నుండి విముక్తి కల్పిస్తామని ప్రకటించింది.
భారతదేశనికి స్వాతంత్య్రం లభించాక గోవాను భారత్ స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించింది. అయితే పోర్చుగీస్ వారు దీనిని వ్యతిరేకించారు. ఈ నేపధ్యంలో 1940 నుంచి గోవాలో స్వాతంత్య్ర ఉద్యమం తీవ్రమయ్యింది. పలు సత్యాగ్రహాలు నిర్వహించారు. గోవాను మహారాష్ట్రలో కలపాలని కొందరు, కర్ణాటకలో కలపాలని మరికొందరు డిమాండ్ చేశారు. కొందరు పోర్చుగీసు వారి ఆధీనంలో ఉంటూ, స్వయంప్రతిపత్తిని కోరుకున్నారు. మరికొందరైతే పూర్తి స్వాతంత్ర్యం కోరుకున్నారు.
ఈ పరిస్థితులను గమనించిన మహాత్మాగాంధీ గోవా విముక్తి విషయంలో అందరూ ఏకతాటిపైకి రావాలని సూచించారు. 1947లో పోర్చుగీసు పాలనకు వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమయ్యింది. ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి పోర్చుగీస్ ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నించింది. 1961, డిసెంబరు18న నేవీ, ఎయిర్ ఫోర్స్‌తో పాటు 30 వేల మంది భారతీయ సైనికులు గోవాపై దాడి చేసి ఫోర్చుగీసువారిని గోవా నుంచి తరిమికొట్టారు. ఈ మొత్తం ఆపరేషన్‌కు భారత సైన్యం ‘ఆపరేషన్ విజయ్’ అనే పేరు పెట్టింది. సందర్భాన్ని పురస్కరించుకుని గోవాలో ప్రతీయేటా డిసెంబరు 19న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తారు. అలాగే భారత్‌లో గోవా భాగమైనందున ఆగస్టు 15న కూడా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment