
ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలలో భారతదేశం ఒకటి. మన దేశంలో ఎన్నికలు జరిగినప్పుడల్లా కొన్ని వింతలు కనిపిస్తూ ఉంటాయి. 2008 మేఘాలయ ఎన్నికల్లో ఇలాంటి ఆసక్తికర ఉదంతం చోటు చేసుకుంది. నాడు కెన్నెడీతో పాటు హిట్లర్ పేరు వార్తాపత్రికల ముఖ్యాంశాల్లో కనిపించాయి. 2024 లోక్‌సభ ఎన్నికల నేపధ్యంలో భారత ఎన్నికల సంఘం ఈ ఘటనను ‘ఎన్నికల కథనాలు’లో పంచుకుంది.
2008లో మేఘాలయలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పత్రికల్లో ఒక షాకింగ్ న్యూస్ ప్రచురితమైంది. ‘జాన్ ఎఫ్ కెన్నెడీ స్వయంగా అడాల్ఫ్ హిట్లర్‌ను అరెస్టు చేశారు’ అనేది దాని హెడ్డింగ్. ఆ రెండు పేర్లకు చారిత్రక ప్రాధాన్యత ఉండటంతో ఈ వార్త దేశవ్యాప్తంగా అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉన్నఅప్పటి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అభ్యర్థి అడాల్ఫ్ లూ హిట్లర్ మారక్‌ను ఏదో కేసులో అక్కడి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జాన్ ఎఫ్ కెన్నెడీ అరెస్టు చేశారు. మరుసటి రోజు వార్తాపత్రికల్లో ‘జాన్ ఎఫ్ కెన్నెడీ చేతుల మీదుగా అడాల్ఫ్ లూ హిట్లర్ అరెస్ట్’ అనే శీర్షికతో ఈ వార్తను ప్రచురించారు. ఇది చర్చనీయాంశంగా మారింది. నాటి ఎన్నికల ఫలితాల్లో హిట్లర్ విజయం సాధించారు.
లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం ఈ కథనాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లొ పోస్ట్ చేసింది. గత ఏడాది అడాల్ఫ్ హిట్లర్ మారక్ తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. కాగా జాన్ ఎఫ్ కెన్నెడీ అమెరికా 35వ అధ్యక్షుడు. అతను 1961 నుండి నవంబర్ 1963లో హత్యకు గురయ్యే వరకు ఈ పదవిలో కొనసాగారు. అదేవిధంగా అడాల్ఫ్ హిట్లర్ ఒకప్పటి జర్మనీ నియంత. ఆయన 1945లో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
#Chunaviकिस्से
भारतीय चुनावों से जुड़े रोचक किस्से 🙌#ECI #ChunavKaParv #DeshKaGarv #Elections2024 pic.twitter.com/1o88yQB3B2— Election Commission of India (@ECISVEEP) March 18, 2024