
మీ పేరు కమలా! అయితే మీకో బంపర్ ఆఫర్! ఈనెల 24న.. అదేనండీ ఆదివారం రోజు మీకు ఓ ప్రఖ్యాత థీమ్ పార్కులోకి ఎంట్రీ ఉచితం.. అవునండీ నిజమే.. మీరు పేరు కమల, కమ్లా లేదా కమల్, కమలం అయితే చాలు ఎలాంటి రుసుము చెల్లించకుండానే సదరు పార్కులో ప్రవేశించవచ్చు. అయితే ఫొటో ఐడీ మాత్రం తప్పనిసరి. బెంగళూరు, కొచ్చి, హైదరాబాద్‌లో ఉన్నవాళ్లకు మాత్రమే ఈ ఆఫర్! ఇంతకీ ఈ ఆఫర్ ఇచ్చింది ఎవరో చెప్పమంటారా! వండర్‌లా.. అవును ఈ అమ్యూజ్‌మెంట్ థీమ్ పార్క్ చైన్ ఈ మేరకు తమ కస్టమర్లకు అవకాశం కల్పించింది. అయితే ఇందుకో ప్రత్యేకత ఉంది.
భారత- జమైకా సంతతికి చెందిన కమలా హారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలిగా పదవి చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు జనవరి 20న ప్రమాణ స్వీకారం చేశారు. తద్వారా అగ్రరాజ్య తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్‌గా, ఈ అవకాశం దక్కించుకున్న తొలి శ్వేతజాతీయేతరురాలిగా చరిత్ర సృష్టించారు. ఈ నేపథ్యంలో వండర్‌లా ఆమె విజయాన్ని సెలబ్రేట్ చేస్తూ..‘‘ఈ ఆదివారం అంతా కమల విజయమే!’’ ఈ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది.(చదవండి: అమ్మ మాట బంగారు బాట)
కమల అన్న పేరు ఉన్నవాళ్లకు ఉచిత ప్రవేశం కల్పిస్తామని చెప్పింది. అయితే తొలి 100 మంది అతిథులకు మాత్రమే ఈ అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. దీనితో పాటు మరికొన్ని షరతులు కూడా వర్తిస్తాయని పేర్కొంది. ఇంకెందుకు ఆలస్యం ఒకవేళ మీరు వండర్‌లాను సందర్శించాలన్న కోరిక ఉంటే ఈ ఆఫర్‌ను వినియోగించుకోండి మరి! ఏంటీ.. కమల అని కలిసి వచ్చేట్లుగా మీకు పేరు పెట్టిన తల్లిదండ్రులకు మరోసారి థాంక్స్ చెప్పుకొంటున్నారా!?