![Kishan Reddy Letter Kerala CM To Arrange Better Facilities In Sabarimala - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/16/kishan-reddy.jpg.webp?itok=AbA4swSo)
సాక్షి, న్యూఢిల్లీ: కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి క్షేత్రంలో కనీస ఏర్పాట్ల లేమి కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కేరళ ముఖ్యమంతి పినరయి విజయన్‌కు లేఖ రాశారు. శబరిమలలో అయ్యప్పస్వాములకు కనీస సౌకర్యాలు కల్పించే విషయంలో కేంద్రప్రభుత్వం తరపున సంపూర్ణసహకారం ఉంటుందని ఆయన లేఖలో పేర్కొన్నారు.
అయ్యప్పస్వామి భక్తులు 40 రోజులపాటు చేసే ఆధ్యాత్మిక భావనతో కూడిన మండల దీక్ష ఆ తర్వాత.. శబరిమలలో కొలువైన స్వామివారిని దర్శించుకోవడం హిందూ ధర్మంపట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసానికి నిదర్శనం. ప్రతి ఏటా నవంబర్ నుంచి జనవరి మధ్యలో కోటిమందికిపైగా భక్తులు వివిధ రాష్ట్రాలనుంచి మండలదీక్షను పూర్తిచేసుకుని అయ్యప్పస్వామి దర్శనం కోసం కేరళ రాష్ట్రంలోని శబరిమలకు వస్తున్న విషయం తెలిసిందే. ప్రతిఏటా శబరిమలకు తెలుగు రాష్ట్రాల (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) నుంచి వచ్చే భక్తుల సంఖ్య 15 లక్షలకు పైగానే ఉంటుంది. అయితే ఈసారి శబరిమలలో అయ్యప్పస్వామి సన్నిధానంలో ఏర్పాట్లు సరిగాలేని కారణంగా భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు.. భక్తుల ద్వారా, పత్రికలు, చానళ్లలో వస్తున్న వార్తల ద్వారా తెలుస్తోంది.
ఇటీవలే.. శబరిమల అయ్యప్ప సన్నిధానంలో.. దర్శనం సందర్భంగా కనీస ఏర్పాట్లులేక తొక్కిసలాటలో ఓ బాలిక చనిపోయిన విషయం తెలిసి చాలా బాధకలిగింది. శబరిమలలో అయ్యప్పస్వాములకు తీవ్ర అసౌకర్యం ఎదురవుతున్న సందర్భంలో.. ప్రభుత్వం తరపున తగిన సంఖ్యలో ఉద్యోగులను, ఇతర సిబ్బందిని శబరిమలలో మోహరించి.. భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయగలరని కోరుతున్నాను. శబరిమలపై, భక్తుల పాదయాత్ర మార్గాల్లో.. భోజనం, నీరు, వైద్యంతో సహా స్వాములకు అవసరమైన ఇతర ఏర్పాట్లను వెంటనే చేయగలరని మనవి చేస్తున్నాను.
అయ్యప్పస్వామి మండల దీక్షలో ఉన్న భక్తులకు శబరిమల యాత్ర సందర్భంగా కనీస సౌకర్యాలు కల్పించడం, వారి యాత్ర భక్తిప్రద్రంగా, శుభప్రదంగా జరిగేలా చూడడం అత్యంత అవసరం. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం భక్తులకు సౌకర్యార్థం అందించేందుకు సిద్ధంగా ఉంది. భక్తులకు ఏర్పాట్లు చేసే విషయంలో.. పంబానది పరిసరాలు, సన్నిధానం వరకు పాదయాత్ర, ట్రెక్కింగ్ జరిగే ప్రాంతాల్లో భక్తులకు సహాయం చేసే విషయంలో.. స్వచ్ఛంద సేవాసంస్థల (NGO)ను కూడా భాగస్వాములను చేసేదిశగా చొరవతీసుకోవాలని కోరుతున్నాను. ఈ విషయంలో మీరు వీలైనంత త్వరగా.. ప్రత్యేక చొరవతీసుకుని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాగాన్ని మోహరించి అన్నిరకాల చర్యలు తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నానని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment