Lok Sabha Election Result 2024: ఎన్డీఏ నేతగా మోదీ | Lok Sabha Election Result 2024: NDA unanimously elect Narendra Modi to lead the alliance | Sakshi
Sakshi News home page

Lok Sabha Election Result 2024: ఎన్డీఏ నేతగా మోదీ

Published Thu, Jun 6 2024 4:24 AM | Last Updated on Thu, Jun 6 2024 4:24 AM

Lok Sabha Election Result 2024: NDA unanimously elect Narendra Modi to lead the alliance

ఏకగ్రీవంగా ఎన్నుకున్న నేతలు.. మోదీ సారథ్యంపై ప్రశంసలు 

కూటమి తొలి భేటీలో తీర్మానం.. వీలైనంత త్వరగా ప్రభుత్వ ఏర్పాటు

నితీశ్‌ సహా 16 పార్టీల నేతలు హాజరు 

రేపు ఎన్డీఏ ఎంపీల కీలక సమావేశం 

మోదీని నాయకునిగా ఎన్నుకోనున్న ఎంపీలు.. అనంతరం రాష్ట్రపతికి మద్దతు లేఖల సమర్పణ

బీజేపీ సారథ్యంలోని అధికార ఎన్డీఏ కూటమి నేతగా ప్రధాని నరేంద్ర మోదీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం వెలువడ్డ లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ మెజారిటీ స్థానాలు సాధించడం తెలిసిందే. దాంతో మోదీ వరుసగా మూడోసారి ప్రధాని కానున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఢిల్లీలో ప్రధాని నివాసంలో ఎన్డీఏ కీలక సమావేశం జరిగింది. మోదీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో బీజేపీతో పాటు ఎన్డీఏ పక్షాల అగ్ర నేతలంతా పాల్గొన్నారు.  

న్యూఢిల్లీ/బెంగళూరు: బీజేపీ సారథ్యంలోని అధికార ఎన్డీఏ కూటమి నేతగా ప్రధాని మోదీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం వెలువడ్డ లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ మెజారిటీ స్థానాలు సాధించడం తెలిసిందే. దాంతో మోదీ వరుసగా మూడోసారి ప్రధాని కానున్నారు. తొలి ప్రధాని నెహ్రూ తర్వాత ఈ ఘనత సాధించనున్న నాయకునిగా రికార్డు సృష్టించనున్నారు.

 ఈ నేపథ్యంలో బుధవారం ఢిల్లీలో ప్రధాని నివాసంలో ఎన్డీఏ కీలక సమావేశం జరిగింది. మోదీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో బీజేపీతో పాటు ఎన్డీఏ పక్షాల అగ్ర నేతలంతా పాల్గొన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జేడీ(యూ) చీఫ్‌ నితీశ్‌కుమార్, శివసేన అధినేత ఏక్‌నాథ్‌ షిండే, ఎల్జేపీ (ఆర్‌వీ) చీఫ్‌ చిరాగ్‌ పాశ్వాన్, జేడీ(ఎస్‌) నేత హెచ్‌.డి.కుమారస్వామి, ఎన్సీపీ నాయకుడు ప్రఫుల్‌ పటేల్, జనసేన చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌ సహా 16 పారీ్టలకు చెందిన 21 మంది నాయకులు భేటీలో పాల్గొన్నారు. 

బీజేపీ నుంచి పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అగ్ర నేతలు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌సింగ్‌ తదితరులు హాజరయ్యారు. భేటీనుద్దేశించి తొలుత మోదీ మాట్లాడారు. ఎన్నికల విజయానికి కూటమి పక్షాలను అభినందించారు. కేంద్రంలో ఎన్డీఏ వరుసగా మూడోసారి మెజారిటీ సాధించడం చరిత్రాత్మకమని అభిప్రాయపడ్డారు. ఇది గత 60 ఏళ్లలో ఎవరికీ సాధ్యపడని ఘనత అన్నారు. వీలైనంత త్వరగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా నితీశ్‌ సూచించారు. 

ఇండియా కూటమిలో చేరాలంటూ ఎన్డీఏ పారీ్టలకు కాంగ్రెస్‌ బాహాటంగానే పిలుపులిస్తున్న నేపథ్యంలో అనిశ్చితికి తావు లేకుండా తక్షణం ప్రభుత్వం కొలువుదీరాలని నేతలన్నారు. అందుకు వీలుగా శాఖల పంపకం తదితర మంతనాలను వీలైనంత త్వరగా పూర్తి చేసుకోవాలని నిర్ణయించారు. ప్రభుత్వ కూర్పుపైనా భేటీలో నేతలు చర్చించారు. శుక్రవారం ఎన్డీఏ ఎంపీలంతా సమావేశమై మోదీని తమ నాయకునిగా లాంఛనంగా ఎన్నుకుంటారని హెచ్‌ఏఎం(ఎస్‌) జితిన్‌రాం మాంఝీ వెల్లడించారు. అనంతరం రాష్ట్రపతిని కలిసి ఎన్డీఏ కూటమికి మద్దతు లేఖలు సమరి్పస్తామని భేటీ అనంతరం మీడియాకు వెల్లడించారు. 

మోదీపై నేతల ప్రశంసలు 
దేశ ఘన వారసత్వాన్ని ప్రగతికి, సమగ్రాభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం పాటుపడుతుందంటూ ఎన్డీఏ భేటీలో నేతలంతా తీర్మానం చేశారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు కృషి చేస్తుందని పేర్కొన్నారు. ‘‘ప్రధాని మోదీ సారథ్యంలో గత పదేళ్లలో పలు ప్రజానుకూల నిర్ణయాలతో దేశం అన్ని రంగాల్లోనూ వృద్ధి బాటన సాగుతోంది. ఆయన నాయకత్వంలో 2024 లోక్‌సభ ఎన్నికల్లో సమైక్యంగా పోటీ చేసి గొప్ప విజయం సాధించడం మాకందరికీ గర్వకారణం. మోదీని మా నాయకునిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నాం’’ అంటూ నేతలు తీర్మానించారు. 

ఎన్డీఏతోనే ఉంటాం 
తాము ఎన్డీఏలోనే కొనసాగుతామని బాబు, నితీశ్‌ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి ఊహాగానాలకూ తావు లేదన్నారు. దేశ నిర్మాణం కోసం పదేళ్లుగా మోదీ చేసిన కృషిని ప్రస్తుతిస్తూ నేతలంతా ఆయన్ను అభినందించారని తెలిపారు. ‘‘అంతర్జాతీయంగా భారత్‌ స్థాయిని మోదీ పెంచారు. ఆయన లక్ష్యాల సాధనకు సహకరిస్తాం’’ అన్నారు.

కీలక శాఖలు, స్పీకర్‌ 
ఎన్డీఏ పక్షాల డిమాండ్లు 
2014, 2019ల్లోనూ కేంద్రంలో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పాటైనా ఆ రెండుసార్లూ బీజేపీకి ఒంటరిగానే సంపూర్ణ మెజారిటీ వచి్చంది. ఈసారి మాత్రం ఆ పార్టీ 240 లోక్‌సభ స్థానాలకు పరిమితమై మెజారిటీకి 32 సీట్ల దూరంలో నిలిచింది. దాంతో ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్య పక్షాల మద్దతు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో మోదీ 3.0 సర్కారు పనితీరు గత రెండుసార్లతో పోలిస్తే చాలా భిన్నంగా ఉండేలా కనిపిస్తోంది. ఎన్డీఏ భాగస్వాములంతా కీలక శాఖలు డిమాండ్‌ చేస్తున్నట్టు చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాలతో పాటు జాతీయ మీడియా పేర్కొంటున్న మేరకు ఎవరేం కోరుతున్నారంటే... 

టీడీపీ: ఏకంగా 7 నుంచి 8 కేబినెట్‌ బెర్తులు, ఒక సహాయ మంత్రి పదవి కోరుతోంది! వ్యవసాయ, రవాణా, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్యం, ఐటీ–వాణిజ్య, విద్య, గృహ నిర్మాణ, జల శక్తి, ఆర్థిక (సహాయ) శాఖలతో కూడిన జాబితాను బీజేపీ ముందు పెట్టినట్టు తెలుస్తోంది. లోక్‌సభ స్పీకర్‌ పదవి కూడా 
అడుగుతోంది. 

జేడీ(యూ): జేడీ(యూ) పార్టీ కనీసం  మూడు కేబినెట్‌ పదవులు డిమాండ్‌ చేస్తోంది. ఒకట్రెండు సహాయ మంత్రి పదవులు కూడా కోరవచ్చంటున్నారు. మరోవైపు విపక్షాల ‘ఇండియా’ కూటమి కూడా ఇప్పటికే తమను ఆకర్షించేందుకు ప్రయతి్నస్తోందని జేడీ(యూ) సీనియర్‌ నేత, బిహార్‌ మంత్రి విజయ్‌కుమార్‌ చౌదరి మీడియాకు చెప్పడం విశేషం. ఆయన వ్యాఖ్యలను బీజేపీపై ఒత్తిడి పెంచే వ్యూహంగా భావిస్తున్నారు. 

ఎల్జేపీ (ఆర్‌వీ): ఒక కేబినెట్, ఒక సహాయ మంత్రి పదవి కోసం పట్టుబడుతోంది. బిహార్లో పోటీ చేసిన ఐదు లోక్‌సభ స్థానాల్లోనూ పార్టీ ఘనవిజయం సాధించడం తెలిసిందే. హెచ్‌ఏఎం(ఎస్‌) నేత జితిన్‌రాం మాంఝీ కూడా కేబినెట్‌ పదవి ఆశిస్తున్నారు. 

శివసేన: ఒక కేబినెట్, మరో సహాయ మంత్రి పదవి కోరుతోంది. 

వ్యవసాయ శాఖపై జేడీ(ఎస్‌) కన్ను: తనకు వ్యవసాయ శాఖ కావాలంటూ జేడీ(ఎస్‌) నేత కుమారస్వామి స్పష్టమైన సంకేతాలిచ్చారు. ఆయన పార్టీ జేడీ(ఎస్‌) రెండు లోక్‌సభ స్థానాలు గెలిచింది. ‘‘కేంద్ర వ్యవసాయ శాఖపై మా పారీ్టకి ఆసక్తి ఉంది. అయితే మేమేమీ డిమాండ్లు చేయడం లేదు. మాకు కర్నాటక ప్రయోజనాలే ప్రధానం. కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రానికి ఎలాంటి ప్రాతినిధ్యం కలి్పంచాలో మోదీ నిర్ణయిస్తారు. అయినా దానిపై సరైన సమయంలో మాట్లాడుకుందాం’’ అని చెప్పుకొచ్చారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement