మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోదీ
మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం
ఎన్నికల ఫలితాలు, ప్రభుత్వ ఏర్పాటుపై చర్చ
17వ లోక్‌సభను రద్దు చేయాలని సిఫార్సు
ఆమోదించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా వ్యవహరించాలని మోదీకి సూచన
సాక్షి, న్యూఢిల్లీ: మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాని పీఠాన్ని అధిరోహించబోతున్నారు. వరుసగా మూడుసార్లు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి జవహర్‌లాల్ నెహ్రూ నెలకొలి్పన రికార్డును మోదీ సమం చేయబోతున్నారు. ఈ నెల 8 లేదా 9న ప్రమాణం స్వీకారం చేసే అవకాశం ఉంది. ప్రధాని సహా నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
కాగా, బుధవారం మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. ఎన్డీయే–2 ప్రభుత్వంలో ఇదే చివరి కేబినెట్ సమావేశం. లోక్‌సభ ఎన్నికల ఫలితాలతోపాటు నూతన ప్రభుత్వ ఏర్పాటుపై విస్తృతంగా చర్చించారు. ప్రస్తుత 17వ లోక్‌సభను రద్దు చేయాలని కేబినెట్ సిఫార్సు చేసింది. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఉదయం 11.30 గంటలకు జరిగిన కేబినెట్ భేటీలో మోదీ మాట్లాడారు.
రాజకీయాల్లో గెలుపోటములు ఒక భాగమేనని అన్నారు. నెంబర్ గేమ్ కొనసాగుతుందని చెప్పారు. గత పదేళ్ల పాలనలో ఎన్నో మంచి పనులు చేశామని, భవిష్యత్తులోనూ ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తూనే ఉంటామని వెల్లడించారు. పదేళ్లలో మంత్రులంతా కష్టపడి పనిచేశారని ప్రశంసించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి తనతోపాటు మంత్రివర్గ సహచరుల రాజీనామా లేఖలను సమరి్పంచారు.
మోదీతోపాటు కేంద్ర మంత్రుల రాజీనామాలను రాష్ట్రపతి ఆమోదించారు. నూతన ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా వ్యవహరించాలని మోదీని కోరారు. 17వ లోక్‌సభను రద్దు చేయాలని కోరుతూ కేబినెట్ చేసిన సిఫార్సు లేఖను రాష్ట్రపతి అందజేశారు. దీంతో 17వ లోక్‌సభను రద్దు చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్రపతి భవన్ వర్గాలు వెల్లడించాయి.
ఉప రాష్ట్రపతి ధన్‌ఖడ్‌తో మోదీ భేటీ
ప్రధాని మోదీ బుధవారం తన పదవికి రాజీనామా చేసిన తర్వాత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ధన్‌ఖడ్ మూడు కమలం పువ్వులున్న పుష్పగుచ్ఛాన్ని మోదీకి అందజేసి అభినందనలు తెలియజేశారు. వరుసగా మూడుసార్లు విజయం సాధించినందుకు గుర్తుగా మూడు కమలం పువ్వులను ఇచి్చనట్లు తెలుస్తోంది. అలాగే మోదీ కూడా కొన్ని రకాల మిఠాయిలను ఉప రాష్ట్రపతికి అందజేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ, దిగిపోతున్న మంత్రివర్గానికి రాష్ట్రపతి భవన్‌లో విందు ఇచ్చారు. ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా దీనికి హాజరయ్యారు.
టీడీపీ, జేడీ(యూ) మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటు
సార్వత్రిక ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ మిత్రపక్షాల సహాయంతో వరుసగా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. ఈసారి కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యా బలం బీజేపీకి లభించలేదు. ఇతర పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీడీపీ, జేడీ(యూ), ఇతర మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ పెద్దలు నిర్ణయించారు.
ఇదిలా ఉండగా, కేంద్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి సైతం తన వంతు ప్రయత్నాలు ప్రారంభించింది. దీంతో హస్తినలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎన్డీయే నుంచి కొన్ని భాగస్వామ్య పక్షాలు ప్రతిపక్ష కూటమిలో చేరబోతున్నాయంటూ ఢిల్లీలో ఊహాగానాలు మొదలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment