వారణాసికి తరలివచ్చి న కేంద్ర మంత్రులు,ముఖ్యమంత్రులు, ఎన్‌డీఏ పక్ష నేతలు
వారణాసి: ఉత్తరప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక నగరం వారణాసి నుంచి ప్రధాని మోదీ మంగళవారం నామినేషన్ దాఖలుచేశారు. మూడోసారి వారణాసి నుంచి బరిలో దిగిన మోదీకి మద్దతుగా కేంద్ర మంత్రులు, బీజేపీపాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్‌డీఏ కూటమి పార్టీల అగ్రనేతలు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాని నామినేషన్‌ను ప్రతిపాదించిన నలుగురిలో ఒక బ్రాహ్మణుడు, ఇద్దరు ఓబీసీలు, ఇక దళితుడు ఉన్నారు. పండిట్ జ్ఞానేశ్వర్ శాస్త్రి, బైజ్‌నాథ్ పటేల్, లాల్‌చంద్ కుష్వాహా, సంజయ్ సోంకర్‌లు మోదీ నామినేషన్‌ను ప్రతిపాదించారు. అయో« ద్యలో బాలరామాలయం ప్రాణ ప్రతిష్ఠ క్రతువుకు ముహూర్తాన్ని నిర్ణయించిన పండితుల్లో జ్ఞానేశ్వర్ శాస్త్రి కూడా ఒకరు. బైజ్‌నాథ్ పటేల్, లాల్‌చంద్ కుష్వాహా ఓబీసీలు కాగా, సోంకార్ బీజేపీ వారణాసి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్న దళిత నేత.
కలెక్టరేట్ నిండా ప్రముఖులే
బీజేపీ చీఫ్ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్, హర్‌దీప్‌సింగ్ పురీ, అనుప్రియా పటేల్, రాందాస్ అథవాలే, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, హిందుస్తానీ అవామ్ మోర్చా(ఎస్) వ్యవస్థాపకుడు జితన్ రాం మాంఝీ, రాష్ట్రీయ లోక్‌మోర్చా చీఫ్ ఉపేంద్ర కుష్వాహా, నిషద్ పార్టీ చీఫ్ సంజయ్ నిషద్, సుహేల్‌దేవ్ భారతీయ సమాజ్‌పార్టీ చీఫ్ ఓంప్రకాశ్ రాజ్‌భర్, ఆర్‌ఎల్‌డీ చీఫ్ జయంత్ చౌదరి, ఎల్‌జేపీ(రాంవిలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, అన్బుమణి రాందాస్, తమిళ మానిల కాంగ్రెస్ చీఫ్ జీకే వాసన్, బీజేపీ నేత దేవనాథన్ యాదవ్, భారతధర్మ జనసేన అధ్యక్షుడు తుషార్ వెల్లపల్లి, అసోమ్ గణపరిషత్ అధ్యక్షుడు అతుల్ బోరాలు వారణాసి కలెక్టరేట్‌లో మోదీ నామినేషన్ కార్యక్రమా నికి హాజరయ్యారు.
మోదీ నామినేషన్ వేయడానికి వస్తున్నారని తెలిసి స్థానికులు పెద్ద సంఖ్యలో వారణాసి కలెక్టరేట్‌కు వచ్చారు. నామినేషన్ వేశాక మోదీ ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌చేశారు. ‘‘ ఎన్‌డీఏ నేతలు మద్దతు గా ఇక్కడకు రావడం నాకు గర్వకారణం. దేశ ప్రగతికి, అన్ని ప్రాంతాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఎన్‌డీఏ కూటమి కంకణబద్దమైంది. భవిష్యత్తు లోనూ ఇలాగే దేశ ప్రగతికి పాటుపడతాం’ అని మోదీ అన్నారు.
దశశ్వమేథ్ ఘాట్‌లో పూజలు
నామినేషన్ వేయడానికి ముందు మోదీ మంగళవారం ఉదయం కాశీలో గంగా తీరాన దశశ్వమేథ్ ఘాట్‌లో పూజలు చేశారు. ఘాట్ వద్ద వేదమంత్రాల మధ్య గంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత పడవలో నమో ఘాట్‌కు వెళ్లారు. అక్కడి కాలభైరవ ఆలయంలో పూజలు చేశారు. ఆ తర్వాత నేరుగా కలెక్టరేట్‌కు వెళ్లారు.
బూత్‌కు ‘370’ ఓట్లు ఎక్కువ పడాలి
నామినేషన్ తర్వాత కాశీలోని రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్‌లో కాశీ నియోజకవర్గ బీజేపీ నేతలు, కార్యకర్తలతో మోదీ సమావేశమయ్యారు. ‘‘జమ్మూకశ్మీర్‌లో రద్దయిన ఆర్టికల్ 370కి గుర్తుగా కాశీలోని ప్రతి బూత్‌లో గతంతో పోలిస్తే నాకు 370 ఎక్కువ ఓట్లు పడేలా చేసే బాధ్యత మీదే’ అని మోదీ అన్నారు. కేంద్ర, యూపీ రాష్ట్ర ప్రభుత్వ పథకాల గురించి మరింతగా ప్రజలకు వివరించాలని సూచించారు. బీజేపీ కార్యకర్తలకు మోదీ విజయమంత్రాలను ఉపదేశించారని బీజేపీ ఒక ప్రకటనలో పేర్కొంది. కాంగ్రెస్ యూపీ చీఫ్ అజయ్ రాయ్, బీఎస్పీ నేత అథ్‌హర్ జమాల్ లారీ మోదీకి పోటీగా బరిలో నిలబడ్డారు.
సొంత ఇల్లు, కారు లేదు మోదీ అఫిడవిట్
మోదీ తన స్థిరచరాస్తుల వివరాలను అఫిడవిట్‌లో పొందుపరిచారు. అఫిడవిట్ ప్రకారం.. మోదీకి సొంత భూమి, ఇల్లు, కారు లేవు. చేతిలో రూ.52,920 నగదు ఉంది. రూ.3.02 కోట్ల చరాస్తులు ఉన్నాయి. 2018–19లో రూ.11,14,230గా ఉన్న ఆదాయం 2022–23 వచ్చేసరికి రూ.23,56,080కు పెరిగింది. గాంధీనగర్ ఎస్‌బీఐ బ్రాంచీలో రూ.73,304, వారణాసి ఎస్‌బీఐ బ్రాంచీలో రూ. 7,000 నగదు ఉంది. ఎస్‌బీఐలో రూ.2.85 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి. రూ.2.67 లక్షల విలువైన, 45 గ్రాముల బరువైన నాలుగు బంగారు ఉంగరాలు ఉన్నాయి.
9.12 లక్షల విలువైన నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్లు ఉన్నాయి. నామినేషన్ పత్రాల్లో భార్య పేరును జశోదాబెన్‌గా పేర్కొన్న మోదీ ఆమె ఆస్తుల వివరాలు తనకు తెలియదని పేర్కొన్నారు. ఆయనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. ఆయనకు అప్పులు కూడా లేవు. 1967లో ఎస్‌ఎస్‌సీ, 1978లో ఢిల్లీ యూనివర్సిటీలో బీఏ డిగ్రీ, 1983లో గుజరాత్ యూనివర్సిటీలో ఎంఏ పూర్తిచేశారు. 2019 ఎన్నికల అఫిడవిట్‌లో గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఒక ప్లాట్ ఉందని పేర్కొన్న మోదీ ఈసారి దానిని ప్రస్తావించలేదు.
Comments
Please login to add a commentAdd a comment