తొలిసారి విడతలవారీగా.. | Monsoon Session Of Parliament Starts From 14/09/2020 To 01/10/2020 | Sakshi
Sakshi News home page

తొలిసారి విడతలవారీగా..

Published Mon, Sep 14 2020 5:04 AM | Last Updated on Mon, Sep 14 2020 9:33 AM

Monsoon Session Of Parliament Starts From 14/09/2020 To 01/10/2020 - Sakshi

మీడియాతో మాట్లాడుతున్న ఓం బిర్లా 

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలకు రంగం సిద్దమైంది. నేటి(సోమవారం) నుంచి 18 రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. కరోనా ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో.. అన్ని జాగ్రత్తలతో, కోవిడ్‌ –19 నిబంధనలను పూర్తిగా పాటిస్తూ, కొత్త విధి, విధానాలతో ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు. విజృంభిస్తున్న కరోనా, కుదేలైన ఆర్థిక వ్యవస్థ, సరిహద్దుల్లో చైనా దుస్సాహసాలు.. తదితర వైఫల్యాలను లేవనెత్తి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్‌ నేతృత్వంలోని విపక్షం సిద్ధమవుతోంది. ఉభయ సభలు తొలిసారి విడతలవారీగా సమావేశం కావడం ఈ సమావేశాల ప్రత్యేకత. రాజ్యసభ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, లోక్‌సభ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరుగుతుంది. కోవిడ్‌–19 నెగెటివ్‌ ఉన్నవారికే సభలోనికి అనుమతించడంతో పాటు, మాస్క్‌ కచ్చితంగా ధరించాలన్న నిబంధనలను కచ్చితంగా అమలు చేయనున్నారు. ఇప్పటికే ఎంపీలు, సిబ్బంది సహా 4 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. చాలా కార్యకలాపాలను డిజిటలైజ్‌ చేశారు. భౌతిక దూరం ఉండేలా ఎంపీల సీట్లలో మార్పులు చేశారు. గ్యాలరీల్లోనూ సభ్యులు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. మొత్తం పార్లమెంటు ప్రాంగణాన్ని శుద్ధి చేశారు.

అలాగే, సమావేశాల ప్రారంభానికి గరిష్టంగా 3 రోజుల ముందు కరోనా పరీక్ష జరిపించుకుని, నెగెటివ్‌ రిపోర్ట్‌ తీసుకుని సభకు రావాల్సి ఉంటుంది. రోజులో పలుమార్లు పార్లమెంటు ప్రాంగణాన్ని, వాహనాలను శానిటైజ్‌ చేసేలా చర్యలు తీసుకున్నారు. భద్రత నియమాల్లోనూ మార్పులు చేశారు. భౌతికంగా ముట్టుకోవాల్సిన అవసరం లేకుండా సెక్యూరిటీ స్కానింగ్‌ చేయనున్నారు. పార్లమెంటు సమావేశాలను రిపోర్ట్‌ చేసేందుకు వచ్చే మీడియా ప్రతినిధులను కరోనా పరీక్ష చేయించుకోవాల్సిందిగా ఆదేశించారు. ప్రధాన భవనంలోనికి మంత్రులు, ఎంపీలను మాత్రమే అనుమతిస్తారు. సభలోనూ సభ్యుడు మాస్క్‌ ధరించి, కూర్చోని ఉండే ప్రసంగించే వెసులుబాటు క ల్పించారు. ఎంపీలందరికీ ప్రత్యేక కోవిడ్‌–19 కిట్స్‌ను డీఆర్‌డీఓ అందజేయనుంది. అందు లో 40 డిస్పోజబుల్‌ మాస్క్‌లు, 5 ఎన్‌ 95 మాస్క్‌లు, 50 ఎంఎల్‌ శానిటైజర్‌ సీసాలు 20, ఫేస్‌ షీల్డ్, 40 జతల గ్లవ్స్, ముట్టుకోకుండా ద్వారాలను తెరిచేందుకు, మూసేందుకు వినియోగించే హుక్, గ్రీన్‌ టీ బ్యాగ్స్‌ ఉంటాయి. 

కీలక అంశాలపై చర్చకు విపక్షం పట్టు 
ఆర్థిక వ్యవస్థ మందగమనం, నిరుద్యోగం, చైనాతో ఉద్రిక్తత.. అంశాలపై సభలో చర్చ జరగాలని వర్షాకాల సమావేశాల ఎజెండాపై చర్చించేందుకు  సమావేశమైన పార్టీల ఫ్లోర్‌ లీడర్ల భేటీలో విపక్ష పార్టీలు కోరాయని డీఎంకే నేత టీఆర్‌ బాలు తెలిపారు. ఈ లోక్‌సభ బీఏసీ(బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ) సమావేశం స్పీకర్‌ ఓం బిర్లా అధ్యక్షతన ఆదివారం జరిగింది. సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరిస్తామని పార్టీల ప్రతినిధులు హామీ ఇచ్చారని స్పీకర్‌  తెలిపారు. బీఏసీ నిర్ణయించే అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి చెప్పారు.

సమావేశాల అజెండాను నిర్ణయించేందుకు పార్టీల ఫ్లోర్‌ లీడర్లు మంగళవారం  కూడా  భేటీ అవుతారన్నారు. కోవిడ్‌పై మంగళవారం చర్చ జరిగే అవకాశముందని పార్లమెంటు వర్గాలు తెలిపాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం 11 ఆర్డినెన్స్‌లకు సంబంధించిన బిల్లులు సహా 23 బిల్లులను పార్లమెంటు ముందుకు తీసుకురానుంది. తొలి రోజు మాజీ రాష్ట్రపతి ప్రణబ్, ఇటీవల మరణించిన  సభ్యులు, మాజీ సభ్యులకు నివాళులర్పించిన అనంతరం ఉభయ సభలు గంట పాటు వాయిదా పడతాయి. ఆ తరువాత రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక జరుగుతుంది. లోక్‌సభలో హోమియోపతిక్‌ సెంట్రల్‌ కౌన్సిల్, ఇండియన్‌ మెడిసిన్‌ సెంట్రల్‌ కౌన్సిల్‌ సవరణ బిల్లులపై చర్చ జరుగుతుంది.

ఆ బిల్లులను అడ్డుకుంటాం 
ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన 11 ఆర్డినెన్స్‌లకు సంబంధించిన బిల్లుల్లో నాలుగింటిని గట్టిగా వ్యతిరేకించాలని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. వ్యవసాయానికి సంబంధించిన 3 ఆర్డినెన్స్‌లను, బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టానికి సంబంధించిన మరో ఆర్డినెన్స్‌ను తాము వ్యతిరేకిస్తున్నామని కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ స్పష్టం చేశారు. ఈ విషయంపై ఉభయసభల్లో ఉమ్మడిగా పోరాడేందుకు ఇతర విపక్షాలతో చర్చిస్తున్నామన్నారు. చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు, కరోనా విజృంభణ, దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థ తదితర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించనున్నామని, ఇందుకు ఇతర విపక్షాలతో కలిసి ఒక ఉమ్మడి వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించామని వెల్లడించారు. విపక్షం వ్యక్తం చేసే ఆందోళనలకు సభలో ప్రధానే స్వయంగా సమాధానమివ్వాలని డిమాండ్‌ చేస్తామన్నారు. సభలో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహంపై సానుకూల పక్షాలతో తాను, గులాం నబీ ఆజాద్,  ఆనంద్‌ శర్మ, అహ్మద్‌ పటేల్, కేసీ వేణుగోపాల్‌ చర్చలు జరుపుతున్నామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement