కేరళలో పెను విషాదం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులతో ప్రయాణిస్తున్న కారులో మంటలు చెలరేగడంతో పురుటి నొప్పులతో బాధపడుతోన్న ఓ గర్భిణి, ఆమె భర్త సజీవదహనమయ్యారు. ఈ ఘటనలో వెనక సీట్లలో కూర్చున్నవారు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకోగా.. కారు ముందు భాగంలో ఉన్న దంపతులు మాత్రం కళ్ల ముందే అగ్నికి ఆహుతయ్యారు. మరో కొన్ని నిమిషాల్లో ఆస్పత్రికి చేరుకుంటారనే సమయంలో ఈ దుర్ఘటన జరగడం మరింత విషాదం. మృతులను కే రీషా(26).. ఆమె భర్త ప్రజిత్(32)గా గుర్తించారు.
వివరాలు.. కన్నూరు జిల్లాకు చెందిన రీషా, ప్రజిత్ దంపుతులకు పెళ్లై.. 8 ఏళ్ల కూతురు శ్రీపార్వతి ఉంది. కుట్టియత్తూర్ గ్రామ పంచాయతీ పరిధిలో నివాసం ఉంటున్నారు. ప్రజిత్ సివిల్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తుండగా.. రీషా ప్రస్తుతం నిండు గర్భిణి. ఆమెకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు అంతా కలిసి ఇంటికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్నూరు జిల్లా ఆసుపత్రికి మారుతీ సుజుకీ ఎస్ ప్రెస్సో కారులో బయల్దేరారు. కారులో ప్రజిత్, తన భార్య, కూతురు, తల్లి, అత్త, మామ సహా మొత్తం ఆరుగురు ప్రయాణిస్తున్నారు.
కన్నూర్ ఆస్పత్రికి సమీపంలోకి రాగానే కారులో అనూహ్యంగా మంటలు చెలరేగాయి. రోడ్డుపై వెళ్తున్న వాహనాలు కారు బానెట్ కింద మంటలు రావడం గమనించి డ్రైవింగ్ సీట్లో ఉన్న ప్రజిత్‌ను అప్రమత్తం చేశారు. వెంటనే అతను కారుని ఆపి డోర్‌లు తెరిచేందుకు ప్రయత్నించాడు. కానీ ముందు తలుపులు లాక్ పడిపోవడంతో రీషా, ఆమె భర్త తప్పించుకునే అవకాశం లేకపోయింది. అయితే ప్రజిత్ వెనక డోర్‌లు తెరిచి అందులో ఉన్న వారిని బయటకు తోసేశాడు. ఇంతలో మంటలు కారు ముందు భాగంతో ఉవ్వెత్తున వ్యాపించాయి.
A couple was charred to death when the car in which they were travelling caught fire near the District Govt Hospital #Kannur, #Kerala on Thursday.
— Hate Detector 🔍 (@HateDetectors) February 2, 2023
Police said 6 persons were travelling in the car & 4 of them who were sitting in the rear seat escaped when the car caught fire. pic.twitter.com/afBMTxaU5p
బయటకు దిగిన కుటుంబ సభ్యులు సాయం కోసం ఆర్తనాదాలు చేశారు. ఇది గమనించిన స్థానికులు వాహనం దగ్గరకు పరుగెత్తారు. బయటనుంచి కారు డోరును తెరిచేందుకు యత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ప్రమాదంపై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆపే ప్రయత్నం చేసింది.
అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అందరూ చూస్తుండగానే మంటల్లో దంపతులిద్దరూ సజీవదహనమయ్యారు. వాహనం ముందు భాగంలో మంటలు ఒక్కసారిగా ఎక్కువ కావడంతో పెట్రోల్ ట్యాంకు పేలుతుందనే భయంతో దూరంగా జరిగామని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. కారులో మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియలేదని.. నిపుణులు పరిశీలించిన అనంతరం స్పష్టత వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment