ఎర్రకోట వేదికగా కేంద్రం రాహుల్‌ గాంధీని అవమానించిందా? | Rahul Gandhi Sitting Second Last Row At Red Fort Independence Day Celebration | Sakshi
Sakshi News home page

ఎర్రకోట వేదికగా కేంద్రం రాహుల్‌ గాంధీని అవమానించిందా?

Published Thu, Aug 15 2024 1:18 PM | Last Updated on Thu, Aug 15 2024 2:24 PM

Rahul Gandhi Sitting Second Last Row At Red Fort Independence Day Celebration

ఢిల్లీ : ఎర్రకోట వేదికగా 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దాదాపు 10 ఏళ్ల తర్వాత ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ అరుదైన ఘనత సాధించారు. అయితే ప్రొటోకాల్‌ ప్రకారం ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్‌ గాంధీకి కేంద్రం సరైన గౌరవం ఇవ్వలేదనే కామెంట్లు సోషల్‌ మీడియాలో వినిపిస్తున్నాయి.

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ ఎర్రకోట వేదికగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడకలకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో రాహుల్‌ గాంధీ హాజరయ్యారు. అయితే రాహుల్‌ గాంధీ చివరి వరుసలో ఒలింపిక్ పతక విజేతలతో కలిసి కూర్చున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

తెల్లటి కుర్తా-పైజామా ధరించిన రాహుల్ గాంధీ భారత హాకీ జట్టు ఫార్వర్డ్ గుర్జంత్ సింగ్ పక్కన కూర్చున్నట్లు కనిపించారు. ముందు వరుసలో ఒలింపిక్ పతక విజేతలు మను భాకర్, సరబ్జోత్ సింగ్ ఉన్నారు. ఒలింపిక్ కాంస్య విజేత హాకీ జట్టు సభ్యులు, ఆ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్,పీఆర్ శ్రీజేష్ కూడా రాహుల్ కంటే ముందు భాగంలో కూర్చున్నారు.

 

ప్రోటోకాల్ ప్రకారం, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడికి, క్యాబినెట్ మంత్రికి సమానమైన ర్యాంక్ ఉన్నవారికి ఎల్లప్పుడూ ముందు వరుసలో సీటు కేటాయించబడుతుంది. ముందు వరుసలో భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, శివరాజ్ సింగ్ చౌహాన్,అమిత్ షా,ఎస్ జైశంకర్ ఉన్నారు.

స్పందించిన కేంద్రం 
రాహుల్ గాంధీ సీటింగ్ ఏర్పాటుపై సోషల్ మీడియాలో చర్చలు జరగడంతో, ఒలింపిక్ పతక విజేతలకు ముందు వరుసలు కేటాయించడంతో రాహుల్‌ గాంధీ సీటును వెనక్కి మార్చాల్సి వచ్చిందని రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం, సీటింగ్ ప్లాన్‌లను రూపొందించడం రక్షణ మంత్రిత్వ శాఖ బాధ్యత.

అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలోనూ
అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలోనూ.. ఆ తరువాత బీజేపీ హయాంలోనూ.. అప్పటి లోక్‌సభ ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్న సోనియా గాంధీకి ఎప్పుడూ మొదటి వరుసలో సీటు కేటాయించడం జరిగింది. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడి స్థానం 2014 నుంచి ఖాళీగానే ఉంది. ఎందుకంటే దిగువ సభ బలంలో పదో వంతు మెజారిటీని ఏ పార్టీ సాధించడం లేదు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 99 స్థానాలను కైవసం చేసుకుంది. అంతకు ముందు ఎన్నికల్లో అంటే 2014, 2019 ఎన్నికలలో 543 మంది సభ్యుల సభ కాంగ్రెస్ వరుసగా 44,52 స్థానాలను గెలుచుకుంది. దీంతో దశాబ్ధ కాలం పాటు ప్రతిపక్ష హోదా ఆ పార్టీకి తగ్గలేదు. మొత్తానికి ఇప్పటికీ కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. అయినా సరే..రాహుల్ సీటును ఎన్డీఏ చివరి వరుసలో ఏర్పాటు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement