
మహారాష్ట్రలో గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలు పోటెత్తడంతో పలు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. తాజాగా ప్రమాదవశాత్తు జలపాతంలో పడి ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మృతిచెందింది. మహారాష్ట్రలోని రాయ్‌ఘడ్ సమీపంలోని కుంభే జలపాతంలో వద్ద ఉన్న కొండగట్టులో ఈ ఘటన జరిగింది.
ముంబైకి చెందిన ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఆన్వీ కామ్దార్ జూలై 16న రీల్ చిత్రీకరించేందుకు ఏడుగురు స్నేహితులతో కలిసి జలపాతం వద్దకు విహారయాత్రకు వెళ్లింది. ఈ క్రమంలో ఒక లోయ దగ్గర వర్షం పడుతున్న సమయంలో రీల్స్ చేస్తోంది. వానల వల్ల ఆ ప్రాంతం అంతా చిత్తడిగా మారి కాలు జారి 300 అడుగుల లోయలో పడింది.
ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు, కోస్ట్ గార్డ్, మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఆరు గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ చేసి యువతిని బయటకు తీసుకుని వచ్చారు. అయితే కిందకు పడిపోవడంతో తీవ్ర గాయాలపాలైన యువతిని మనగావ్ సబ్ జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.
విహారయాత్ర.. విషాదంగా మారడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీటిపర్యంతం అవుతున్నారు. మరోవైపు మనగావ్ పోలీసులు, తహలసీల్దార్ పర్యాటకులకు సూచనలు చేశారు. జలపాతాలను, కొండలను సందర్శించే సమయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా, జాగ్రత్తగా ఉండాలని కోరారు. ప్రాణాలకు ముప్పు కలిగించే ప్రమాదకర ప్రవర్తనలను నివారించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.